ఈఎస్ అనితకు టెండర్ దరఖాస్తును అందిస్తున్న మహిళ
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: గతంతో పొలిస్తే ఈసారి మద్యం వ్యాపారులు కొంత డీలాపడ్డారు. 2017–19 సమయంలో ఎన్నికల హడావుడి.. దరఖాస్తు ఫీజు తక్కువగా ఉండటం వల్ల తీవ్రంగా పోటీ పడ్డారు. ఈసారి ఎన్నికలు లేకపోగా ఫీజు కూడా రెండింతలు పెంచడం వల్ల వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం అన్ని లాభానష్టాలు బేరీజు వేసుకుని ఈసారి ఆశించిన లాభాలు రాకపోవచ్చని చాలా వరకు వ్యాపారులు టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు. 2017లో జరిగిన టెండర్లలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 67 దుకాణాలకు 1579దరఖాస్తులు రాగా ఈసారి 1384 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
ఈసారి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.27కోట్ల 68లక్షల ఆదాయం సమకూరింది. జడ్చర్ల ఎస్‌హెచ్‌ఓ పరిధిలో మాత్రం రికార్డు స్థాయిలో 512 టెండర్లు వచ్చాయి. గతంలో మహబూబ్‌నగర్‌లో అధిక పోటీ ఉంటే ఈసారి మాత్రం జడ్చర్ల పరిధిలో ఉన్న దుకాణాల కోసం తీవ్ర పోటీ కనిపించింది. టెండర్లు ప్రారంభంలో ఓ మోస్తారు స్పందన ఉండగా.. చివరి రెండు రోజులు మంగళ, బుధవారం ఊపందుకుంది. బుధవారం గడువు ముగియడంతో చివరి రోజు దరఖాస్తుదారులు కొంత వరకు పోటీపడ్డారు. ఈనెల 18న సుదర్శన్ గార్డెన్‌లో లాటరీ పద్ధతిన కొత్త దుకాణాదారులను ఎంపిక చేసి, నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాల్లో అమ్మకాలను చేపట్టనున్నారు.
డిమాండ్ ఉన్న దుకాణాలు ఇవే..
మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా డిమాండ్ ఉన్న దుకాణంగా మిడ్జిల్ రికార్డు సృష్టించింది. ఈసారి మిడ్జిల్‌లో ఉన్న దుకాణం కోసం 63 మంది టెండర్లు వేశారు. అదేవిధంగా బాలానగర్ ఒకటో దుకాణానికి 58, బాలానగర్ రెండో దుకాణానికి 53 దరఖాస్తులు వచ్చాయి. హన్వాడ దుకాణానికి 45టెండర్లు పడ్డాయి. తక్కువ టెండర్లు వచ్చిన దుకాణాలలో మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో ఐదు దుకాణాలు ఉన్నాయి.
సీమాంధ్ర వ్యాపారుల పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో వ్యాపారుల దృష్టి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై పడింది. ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, కృష్ణ, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పలువురు మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో టెండర్లు వేశారు.జిల్లాలో వచ్చిన టెండర్లలో దాదాపు 80 నుంచి 100వరకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారుల టెండర్లు ఉన్నట్లు సమాచారం.
అయితే సీమాంధ్ర వ్యాపారులు అధికంగా జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలకు మాత్రమే అధికంగా టెండర్లు వేశారు. మక్తల్, నారాయణపేట ఇతర రిమోట్ ఏరియాల్లో ఉన్న దుకాణాల జోలికి వెళ్లలేదు. అయితే భారీగా మద్యం అమ్మకాలు ఉన్న దుకాణాల వివరాలు సేకరించి రెండేళ్ల కాలంలో ఏ దుకాణం ఏస్థాయిలో అమ్మకాలు చేశారు.. ఏ స్థాయిలో లాభాలు వచ్చాయనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని టెండర్లు వేసినట్లు తెలుస్తోంది.
మహిళా వ్యాపారులు
నూతన మద్యం దుకాణాల కోసం టెండర్లు వేయడానికి మహిళ వ్యాపారులు సైతం ఈఎస్ కార్యాలయానికి వచ్చారు. కొందరు వ్యక్తులు సెంటిమెంట్ కోసం భార్యలను, ఇతర కుటుంబ సభ్యులను టెండర్ వేయడానికి తీసుకు వస్తే.. మరికొందరు మహిళలు వారి పేర్లమీద టెండర్లు వేయడానికి కార్యాలయానికి క్యూ కట్టారు. మద్యం టెండర్లు వేయడానికి వచ్చిన వారితో ఈఎస్ కార్యాలయం పూర్తిగా సందడిగా కన్పించింది. ఓ సమయంలో ఆ రోడ్డు వెంట వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
తగ్గిన దరఖాస్తులు
టెండర్ వేసిన సొమ్ము రూ.1 లక్ష నుంచి రూ. 2లక్షలకు పెంచి దుకాణం రాకుంటే వెనక్కి చెల్లించే పరిస్థితి లేకపోవడం దరఖాస్తులపై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. చివరి రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం నాటికి 589 రాగా.. ఒక్క బుధవారం రోజే 785 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు 1384 దరఖాస్తులు రావడం కొత్త చరిత్రను తిరగరాయలేక పోయింది.
ఇందులో మహబూబ్‌నగర్ 435, జడ్చర్ల 512, నారాయణపేట 287, కోస్గిలో 150 దరఖాస్తులు వచ్చాయి. అయితే జిల్లాలో నూతన మద్యం పాలసీ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.27కోట్ల 68లక్షల ఆదాయం వచ్చింది.
18న దుకాణాల కేటాయింపు
ఈనెల 9నుంచి 16వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 164 మద్యం దుకాణాలకు టెండర్లు తీసుకున్నాం. చివరి రోజు ఉమ్మడి జిల్లాలో 2,104టెండర్లు వేశారు. మహబూబ్‌నగర్ 1,384, నాగర్‌కర్నూల్ 1,064, గద్వాల 418, వనపర్తి 516 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 164 దుకాణాలకు 3,382టెండర్లు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.67.64కోట్ల ఆదాయం సమకూరింది. టెండర్‌దారులకు ఈనెల 18న లక్కీడిప్ ద్వారా దుకాణాలను కేటాయిస్తాం. పాస్ జారీ చేసిన వ్యక్తులు మాత్రమే లక్కీడిప్ తీసే ప్రదేశానికి రావాల్సి ఉంటుంది.
– జయసేనారెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీ
Comments
Please login to add a commentAdd a comment