సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గీత కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న బకాయిలనూ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. సొసైటీల్లో లేని గీత కార్మికులకు పెన్షన్, లైసెన్సు రెన్యువల్ గడువు పెంపు తదితర హామీలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం శాసనసభలో కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తోందన్నారు. ప్రధానంగా వ్యవసాయ, నీటి వనరుల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో గౌడ సామాజిక వర్గం ప్రధానమైనదని.. కానీ వారు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు.
మాట నిలబెట్టుకుంటున్నాం..
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం నుండి గీత కార్మికులకు ఎలాంటి సహాయం లభించలేదని.. పైగా లిక్కర్ లాబీల ప్రలోభాలకు తలొగ్గి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మూసేశారని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే కళ్లప్పగించి వేడుక చూశారని మండిపడ్డారు. దీనివల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోవడంతోపాటు ఇటు గీత వృత్తి దెబ్బతిన్నదని చెప్పారు. తాము తెలంగాణ ఉద్యమ సమయంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశామని.. తాము ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్లు దుకాణాలను తిరిగి తెరిపించామని తెలిపారు.
పరిహారం, పెన్షన్ పెంచాం..
కల్లు గీసే సమయంలో చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేశాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలా రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న మూడేళ్ల బకాయిలు రూ.6.38 కోట్లను తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో చెల్లించామన్నారు. గతంలో చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి రూ.2 లక్షలు, అంగవైకల్యం పాలైన వారికి రూ.50 వేలు మాత్రమే ఇచ్చేవారని.. తాము ఈ పరిహారాలను రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. గీత కార్మికులకిచ్చే పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.1,000కి పెంచామని చెప్పారు.
టీఎఫ్‌టీ గీత కార్మికులకూ పెన్షన్
ఇప్పటివరకు కల్లు గీత సహకార సొసైటీ (టీసీఎస్)ల సభ్యులకు మాత్రమే పెన్షన్ లభిస్తోందని.. ఇక నుంచి టీఎఫ్‌టీ (ట్రీ ఫర్ ట్యాపర్– వ్యక్తిగత కల్లుగీత లైసెన్సు) కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 30 వేల కుటుంబాలకు ఆసరా లభిస్తుందన్నారు. టీఎఫ్‌టీ నుంచి టీసీఎస్‌లోకి మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారిని పది రోజుల్లో బదలాయించాలని అధికారులను ఆదేశించారు. కల్లుగీత లైసెన్సుల రెన్యూవల్ గడువును ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలను పెద్దఎత్తున నాటుతున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి 70 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఎక్సైజ్, అటవీ శాఖల సమన్వయంతో చెరువు కట్టల మీద, చెరువు శిఖం వెంబడి, వాగులు, ఒర్రెల వెంట, నదుల ప్రవాహానికి ఇరువైపులా ఈత, ఖర్జూర మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.
తాటి, ఈతచెట్లపై పన్ను రద్దు
రాష్ట్రంలో ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న చెట్ల పన్ను బకాయిలను మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.16 కోట్లు రాబడి తగ్గిపోతున్నా.. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను రద్దు చేస్తున్నామన్నారు. గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటేలా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి గౌడ భవనం నిర్మాణానికి ఐదెకరాల భూమిని, రూ. 5 కోట్లు నిధులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment