పట్నం బతుకు.. కష్టం పొదుపు | Lockdown Financially Affected On Everyone Family | Sakshi
Sakshi News home page

పట్నం బతుకు.. కష్టం పొదుపు

Published Tue, Jun 23 2020 4:28 AM | Last Updated on Tue, Jun 23 2020 9:58 AM

Lockdown Financially Affected On Everyone Family - Sakshi

రవిచంద్ర (రామంతాపూర్‌) ఓ మాల్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌. లాక్‌డౌన్‌కు ముందు తనకొచ్చే రూ.25 వేల నెల జీతంలో రూ.5 వేలైనా పొదుపు చేసేవాడు. అలా దాచుకున్న డబ్బులో కొంత లాక్‌డౌన్‌ సమయంలో అవసరాలకు ఉపయోగపడ్డాయి. కానీ, లాక్‌డౌన్‌ తర్వాత వ్యాపారం సరిగా లేదంటూ యజమాని సగం జీతమే ఇస్తున్నాడు. దీంతో అవసరాలు తీరక అప్పులుచేసి నెట్టుకొస్తున్నాడు.

మల్లికార్జున్‌ (యూసుఫ్‌గూడ బస్తీ) ఓ సినీ స్టూడియోలో పనిచేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదించే వాడు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాలన్నీ వాటితోనే.. కూడబెట్టుకున్న డబ్బులేక లాక్‌డౌన్‌ టైమ్‌లో కుటుంబపోషణకు అప్పు చే శాడు. లాక్‌డౌన్‌లో జీతాల్లేక, అన్‌లాక్‌ సమయంలో పనిలేక ఇబ్బంది పడుతున్నాడు. 

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కృష్ణ ఆటోడ్రైవర్‌. లాక్‌డౌన్‌తో ఆటో తిరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.3 వేలు, 30 కిలోల బియ్యంతో బండి లాగాడు. లాక్‌డౌన్‌ తరువాత ఆటో నడుపుతూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా అవి పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవట్లేదు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. పట్టణ పేద, దిగువ మధ్య తరగతి వర్గాల బతుకుల్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ ఉధృతి కారణంగా ఇంకా కోలుకోని వ్యాపారాలు, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు, పె రుగుతున్న ధరలు పట్టణ ప్రజల నడ్డివిరుస్తున్నాయి. ఆదాయ మార్గాలు తగ్గడం, నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో పొదుపు మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో నెల చివరికొచ్చే సరికి చేతుల్లో చిల్లిగవ్వ లేకుండాపోతోంది. దీంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ దాదాపుగా ఎత్తేసినా ఇంకా చాలా వ్యాపారాలు పుంజుకోలేదు. వస్త్ర వ్యాపారం పడిపోగా, హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చే వా రు 10 శాతానికి మించట్లేదు. మాల్స్‌కు వచ్చేవారు లేక వ్యాపారం తగ్గిపోయింది. దీంతో చాలాచోట్ల సేల్స్‌మన్, వాచ్‌మన్, టెలీ ఆపరేటర్లు, సర్వర్లు, బ్యాంకు కన్సల్టెంట్లు వంటి ఉద్యోగాలు భారీగా ఊడిపోయాయి. సెలూ న్లు, ఐరన్‌ షాపులు, టైలరింగ్‌ వంటి వాటిపై ఆధారపడి బతికే వారి ఆదాయాలు దారు ణంగా పడిపోయాయి. తోపుడుబండ్ల వ్యాపారం మూలనపడగా, ఆటో, క్యాబ్‌ల్లో ప్రయాణాలు తగ్గి డ్రైవర్ల ఆదాయం పడిపోయింది. ఇవన్నీ పత్య్రక్షంగా, పరోక్షంగా పట్టణ ప్రాం త ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి.

ఆదాయం తగ్గి.. ఖర్చులు పెరిగి..
ప్రస్తుతం కూరగాయల ధరలు 30% మేర పెరగ్గా, పాలు, పెరుగు, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసరాల ధరలు 15–20% పెరి గాయి. తగ్గిన ఆదాయాలు, పెరిగిన ఖర్చుల తో పట్టణ ప్రాంతాల్లో పొదుపు తగ్గింది. నెల కు వస్తున్న కొద్దిపాటి ఆదాయాన్ని ఆహారం, ఆరోగ్యం, అద్దె, విద్య, విద్యుత్, గ్యాస్‌ ఇతర నిత్యావసరాలకు వెచ్చిస్తుండటం, వాటి ధర లు  గతంతో పోలిస్తే పెరగటంతో నెల చివరి కొచ్చే సరికి పట్టణ ప్రాంత ప్రజలకు ఖాళీ జే బులే మిగులుతున్నాయి. పట్టణ కుటుంబాల కు వచ్చే ఆదాయాలు తగ్గిపోవడంతో ఇప్పటివరకు పొదుపుచేసిన మొత్తాలతో నెట్టుకొస్తున్నారు. ఈ పొదుపు సొమ్ము అయిపోతే ఇక అప్పులే శరణ్యం కానున్నాయి. ఓ జాతీయ సర్వే సంస్థ ప్రకారం లాక్‌డౌన్‌కు ముందు రూ.10వేల వరకు ఆదాయమున్న ఇంట్లో నెలవారీ పొదుపు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, అదే రూ.20వేలైతే రూ.2వేల నుంచి రూ.6వేలు, రూ.30వేల ఆదాయం ఉంటే రూ.4వేల నుంచి రూ.8వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.10వేలైతే సున్నా, రూ.20వేలైతే  రూ.వెయ్యి నుంచి రూ.2వేలు, రూ.30వేల ఆదాయం ఉంటే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు మాత్రమే ఉంటోంది.

గ్రామీణ పేదలు కొంచెం మెరుగు..
‘లాక్‌డౌన్‌కు ముందు వరకు పూర్తి జీతం ఇవ్వడంతో నెలకు రూ.5వేల వరకు పొదుపు ఉండేది. ఇప్పుడు జీతాల్లో 30శాతం కోతపెట్టారు. దీనికి తోడు నిత్యావసరాల ధరలు, కరెంట్‌ బిల్లులు పెరిగాయి. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు ఆరంభించడంతో ఖర్చు పెరిగింది. ఇప్పుడు నెల చివరకు మిగిలింది రూ.3వేలే’ అని ఖైరతాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ప్రవీణ్‌ తెలిపాడు. అయితే, పట్టణ ప్రాంతాల తో పోలిస్తే గ్రామీణ పేదల ఆదాయం, పొదు పు కొంత మెరుగ్గా ఉన్నాయి. పీడీఎస్‌ బి య్యం, పప్పులకు తోడు కేంద్రం వ్యవసాయ భూములకు అందించిన రూ.2వేల సాయం, జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.500 నగదు బదిలీ, ఉ పాధి పనులు, ధాన్యం అమ్మకాలతో వచ్చిన డబ్బుతో గ్రామీణ పేదల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ప్రభుత్వంలో కీలక స్థానం లో ఉన్న ఓ ఐఏఎస్‌ అధికారి చెప్పారు.

► రాష్ట్రంలో పొదుపునకు దూరమైన పట్టణ ప్రజలు 40లక్షలు
► జాతీయ సర్వేల అంచనా ప్రకారం దేశంలో ఆదాయాన్ని కోల్పోవడం లేదా కోతను ఎదుర్కొంటున్న పట్టణ ప్రాంత కుటుంబాలు 84%
► కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొదుపును మరిచిపోయిన పట్టణ జనాభా 13.9కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement