సెలైన్ వల్లే వారి కంటి చూపు పోయింది
సాక్షి, హైదరాబాద్: సెలైన్ వాటర్‌లో స్వచ్ఛత లేకపోవడం వల్లే సరోజినీ కంటి ఆసుపత్రిలో ఏడుగురు కంటి చూపు కోల్పోయారని కల్చర్ రిపోర్టు తెలిపింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సుదీర్ఘంగా కల్చర్ (స్టెరిలిటీ) పరీక్షలు జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ రిపోర్టును తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. మొత్తం మూడు బ్యా చ్‌లకు చెందిన సెలైన్ వాటర్ బాటిళ్ల నమూనాలను పరీక్షించగా... వాటిలో ఒక బ్యాచ్ బాటిళ్ల నమూనాలో స్వచ్ఛత లేదని రిపోర్డు తెలిపింది. స్వచ్ఛమైన సెలైన్ వాటర్ కాదని నిర్ధారించిన డీసీఏ... అందులో ఏముందో స్పష్టత ఇవ్వలేదని అధికారులు తెలిపారు.
బ్యాక్టీరియా ఉండవచ్చని అంచనా వేస్తున్నా రు. సెలైన్ వాటర్‌లో ఉండే ఏదో ఒక లవణంలో కానీ... రసాయనంలో కానీ లోపం ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని సరఫరా చేసిన కంపెనీపై చట్టపరంగా కేసు పెట్టి తగు చర్య తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు.
1,200 బాటిళ్ల సరఫరా...
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలు అన్నింటినీ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. ఆ ప్రకారం గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్‌ఎస్/ఎఫ్‌ఎఫ్‌ఎస్ (సెలైన్) సరఫరా బాధ్యతను నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1200 సెలైన్ బాటిళ్లు సరోజినీ ఆసుపత్రికి అందజేశారు.
వాటిలో 16,385 బ్యాచ్‌కు చెందిన 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్‌కు చెందిన 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆ ఆసుపత్రికి అందాయి. వాటిలో 624 బాటిళ్లు ఉపయోగించారు. అందులోని కొన్నింటి కారణంగా ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. వాటి నమూనాలనే డీసీఏ పరీక్షించి తాజా నివేదిక సమర్పించింది.