అరవింద్ ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ రణధీర్
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మూడ్రోజుల క్రితం టీడీపీ నేతల మారణహోమ పథకం బెడిసికొట్టినా.. వాళ్లు చేసిన గాయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో సహా 27 మంది గాయపడ్డ ఈ ఘటనలో.. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన రణధీర్ అనే స్పెషల్ పార్టీ పోలీస్ (ఎస్టీఎఫ్) కానిస్టేబుల్ మాత్రం తన కంటిచూపును కోల్పోయారు. మరో కన్ను కనిపిస్తున్నా చూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెప్పడం కంటనీరు తెప్పిస్తోంది.
ప్రస్తుతం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రణ్‌ధీర్ గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు.. అనంతపురానికి చెందిన రణధీర్ ఖాకీ యూనిఫామ్‌పై ఉన్న ఆసక్తితో 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. సత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఈనెల 3 నుంచి చంద్రబాబు పర్యటనలో తన సహచరులతో కలిసి పుంగనూరులో బందోబస్తు డ్యూటీకి వచ్చారు. నాలుగో తేదీ శుక్రవారం టీడీపీ కిరాయి సేనలు మద్యం మత్తులో పోలీసులపై చెప్పులు, బాటిళ్లు విసురుతున్నారు. విధుల్లో ఉన్న రణధీర్, ఇతర పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలను సర్దిచెప్పి పంపే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ, ఒక్కసారిగా అల్లరిమూకలు రాళ్లతో దాడిచేయడంతో రణధీర్ బృందం వెనక్కు వచ్చేసింది. ఉన్నతాధికారులకు దెబ్బలు తగలకుండా అడ్డుగా నిలిచారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు విసురుతున్నారు. దీంతో ఓ డీఎస్పీకి అడ్డుగా నిలబడి తీసుకెళ్తున్న రణధీర్‌కు ఓ రాయి వచ్చి నేరుగా కంటిని తాకింది. కంటి నుంచి రక్తం ధారలుగా కారిపోతూ, భరించలేని నొప్పిని అనుభవించాడు. రెండు కళ్లు కనిపించలేదు. హుటాహుటిన పోలీసులు రణధీర్‌ను పుంగనూరు ఆసుపత్రికి తీసుకెళ్తే పరిస్థితి బాలేదని, తిరుపతికి వెళ్లాలని సూచించారు.
తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో రణధీర్‌కు ఎంఆర్‌ఐ స్కాన్ తీశారు. రాయి కంటిని తీవ్రంగా తాకడంతో ఎడమకంటి నల్లగుడ్డు, తెల్లగుడ్డు దెబ్బతిన్నాయి. లోపలున్న సున్నితమైన నరాలు తెగిపోయాయి. ఫలితంగా ఓ కన్ను కనిపించదని వైద్యులు తేల్చిచెప్పేశారు. నరాలు తెగిపోవడంవల్ల కుడి కన్ను సైతం చూపు కోల్పోయే అవకాశముందని.. దీనికి మందులిచ్చి, ఆ ప్రమాదం రాకుండా ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు చెప్పారు. రణధీర్ తన దుఃఖాన్ని దిగమింగుకుని.. ‘‘సార్, మా అమ్మ, నాన్న ఇద్దరూ పేషెంట్లు. నేను ఉద్యోగం చేసి, కుటుంబాన్ని పోషించాలి.
పోలీసు ఉద్యోగమంటే గౌరవం పెంచాలని ఖాకీ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు చూపుపోయింది. ఇప్పుడు నా బాధంతా నాకు కంటిచూపు పోయిందని నా ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు సర్..’’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులపై దాడిలో పైశాచిక ఆనందం పొందిన టీడీపీ నేతలు.. రణధీర్ జీవితాంతం అనుభవించే బాధకు ఏం బదులిస్తారు? కళ్లెదుటే పోలీసు వాహనాలను పచ్చమూకలు తగులబెడితే ప్రమాదవశాత్తు కాలిపోయాయని పిచ్చి రాతలు రాసిన ‘ఈనాడు’కు రణధీర్ లాంటి పోలీసుల కన్నీళ్లు కనిపించకపోవడం ఆ కంటికి పచ్చ కామెర్లు వచ్చినట్లే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment