
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కట్టాల్సింది కేంద్రమే
కమీషన్ల కోసం నిర్మాణ బాధ్యతలు దక్కించుకుని చారిత్రక తప్పిదం
పైగా 2013–14 ధరలతోనేప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ
స్పిల్ వే నిర్మించకుండానే కమీషన్ల కోసం కాఫర్ డ్యామ్ కట్టి మరో చారిత్రక తప్పిదం
పునాదుల్లోనే స్పిల్ వే.. వరద మళ్లించడం సాధ్యం కాక కాఫర్ డ్యామ్‌లలో ఖాళీలు
ఆ ఖాళీల్లో అధిక ఉధృతితో గోదావరి ప్రవహించడంతో కోతకు గురై దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్
మేం అధికారంలోకి వచ్చాకే రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేశాం
తప్పులన్నీ ఆయనే చేసి.. ఎదుట వారిపై నిందలు మోపడం బాబుకు అలవాటే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తన తప్పిదాలను కప్పిపుచ్చుతూ ఎదుటి వారిని వేలెత్తి చూపడం ఎంత వరకు సమంజసమని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. జీవనాడి పనులను గాడిలో పెట్టిన తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారని ధ్వజమెత్తారు.
విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్టును కమీషన్లకు కక్కుర్తి పడి తామే నిర్మిస్తామంటూ చంద్రబాబు దక్కించుకుని చారిత్రక తప్పిదం చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే కట్టకుండానే.. కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టి చంద్రబాబు మరో చారిత్రక తప్పిదం చేశారని ఎత్తిచూపారు. బాబు నిర్వాకాన్ని తాము అధికారంలోకి వచ్చాక ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టి.. శరవేగంగా సరిచేస్తూ ముందుకెళ్లామని వివరించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
కాసుల కోసం కక్కుర్తితోనే ఇలా..
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సింది కేంద్రమే. కానీ.. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నాడు. అదీ 2013–14లో ఖరారు చేసిన రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేస్తామని అంగీకరించాడు. కానీ.. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33 వేల కోట్ల వ్యయం అవుతుంది. అలాంటిది కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు ఒప్పుకోవడంలో ఆంతర్యమేమిటి?
ఇంత దారుణంగా చేయడమే కాకుండా కాంక్రీట్ పనుల్లో లాభాలు రావని, పెద్దగా కమీషన్లు వచ్చే మట్టి పనులు ముందుగా ప్రారంభించారు. ఇందులోభాగంగా కాఫర్ డ్యామ్ పనులను ఈనాడు రామోజీ వియ్యంకుడు నవయుగకు అప్పగించారు. మట్టి పనులు యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి అప్పగించారు. ఇవన్నీ వాస్తవాలు కావా? నేను సరైన ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నా.. చంద్రబాబూ.. సమాధానం చెప్పండి.
ప్రపంచంలో ఎవరైనా ఇలా కడతారా?
ప్రపంచంలో ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలంటే.. ముందుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే నిర్మించాలి. ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టి.. నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లిస్తూ ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి వీలుగా.. నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు మళ్లించడానికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మిస్తారు. కాఫర్ డ్యామ్‌ల పనులు స్పిల్ వే పనులు పూర్తయిన తర్వాతే మొదలుపెట్టాలి.
కానీ, స్పిల్ వే పునాది స్థాయిలోనే వదిలేసి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చంద్రబాబు చేపట్టారు. స్పిల్ వే పూర్తి కాకపోవడంతో వరద ప్రవాహాన్ని మళ్లించడం సాధ్యం కాక.. రెండు కాఫర్ డ్యామ్‌లకు ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. దాంతో 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల మధ్య కుంచించుకుపోయి ప్రవహించడంతో వరద ఉధృతి పెరిగి ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో నిర్మించిన పునాది డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది.
ప్రదాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల నుంచి 22 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. బుద్ది ఉన్న వారెవరైనా ఇలాంటి పనులు చేస్తారా? ఏదైనా ప్రాజెక్టును ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి. చంద్రబాబు చేసిన తప్పులన్నింటీనీ మేం అధికారంలోకి వచ్చాక సరిదిద్దుతూ.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టాం.
ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్ టుపనులు
మేం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టాం. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి కేంద్రానికి రూ.865 కోట్లు ఆదా చేశాం. కాంట్రాక్టర్‌ను మార్చి స్పిల్ వే పనులు, ఆ తర్వాత అప్రోచ్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశాం. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో డయా ఫ్రమ్ వాల్ నిర్మించాం. గ్యాప్–3లోకాంక్రీట్ డ్యామ్ నిర్మించాం. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన సొరంగాలను పూర్తి చేశాం.
ఇలా ప్రణాళికా బద్ధంగా అన్నీ పూర్తి చేసాం కాబట్టే 2021 జూన్ 11వ తేదీన వరద నీటిని స్పిల్ వే గేట్ల నుంచి 6.1 కి.మీల పొడవునా విజయవంతంగా సముద్రంలోకి మళ్లించగలిగాం. 2022లో గోదావరికి 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా స్పిల్ వే మీదుగా సులభంగా దిగువకు విడుదల చేశాం. కాఫర్ డ్యామ్‌కు ఏమీ కాలేదు. ఇప్పుడు కోతకు గురైన డయా ఫ్రం వాల్ స్థానంలో కొత్త డయా ఫ్రమ్ వాల్ కట్టాలా? లేకపోతే రిపేర్ చేసి మిగిలిన పనులు చేపట్టాలా అనేది కేంద్రం నిర్ణయం మేరకు జరగాల్సి ఉంది.
మూడేళ్లపాటు పోరాటం చేసి, తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించి.. పోలవరానికి నిధుల సమస్య లేకుండా చూశాం. ఇదీ వాస్తవం. చెయ్యాల్సిన పని ఏదీ చేయకుండా.. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందు కు వేరే వాళ్ల మీద వేలెత్తి చూపించడం చంద్రబాబు నైజం. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పింది ఒప్పా? తప్పా? నేను చెప్పింది వాస్తవమా? కాదా?ప్రజలు ఆలోచించాలి.
కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం
» వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
» టీడీపీ ప్రభుత్వ నరమేధంపై ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించాం
» ఇండియా, బీజేపీ కూటముల్లోని పార్టీలను పిలిచాం
» సంఘీభావం తెలిపిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఇండియా కూటమి పార్టీలు
» తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబుకు సంబంధాలు..
» అందుకే ఢిల్లీలో మా ధర్నాకు సంఘీభావం తెలపని రాహుల్ గాంధీ
» మణిపూర్‌లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఉంది కాబట్టే అక్కడి దాడులను ఖండించిన రాహుల్
» ఏపీలో కాంగ్రెస్ అనుకూల చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టే దాడులను రాహుల్ ఖండించలేదు
» బాబుకు ఎస్కోబార్ సన్నిహితుడేమో.. అందుకే ఆయన పేరు కలవరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తోన్న నరమేధంపై కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రజా పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం సాగిస్తోన్న మారణ హోమాన్ని.. అరాచక, ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఢిల్లీలో ధర్నా నిర్వహించామన్నారు. ఈ ధర్నాలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తోన్న నరమేధానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు.. ఫొటోలు ప్రదర్శించామని చెప్పారు. ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు బీజేపీ, ఎన్‌డీఏ కూటమిలోని పార్టీలను ధర్నాలకు ఆహ్వానించామని.. టీడీపీ ప్రభుత్వ హత్యాకాండకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలు చూశాక.. దమనకాండను ఖండించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి రావాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశామన్నారు.
తమ విజ్ఞప్తిని మన్నించి.. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఏఐడీఎంకే, శివసేన(ఉద్ధవ్ థాక్రే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆప్, వీసీకే సహా పలు పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు తమతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమంటూ ఆ పార్టీలు తమకు సంఘీభావం తెలిపాయన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌ను ధర్నాకు ఆహ్వానించామని.. కానీ రాహుల్ గాంధీ ధర్నాకు సంఘీభావం తెలపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని.. అందువల్లే ఢిల్లీలో తాము నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ హాజరు కాలేదని స్పష్టం చేశారు.
మణిపూర్‌లో హింస జరుగుతోందని.. అక్కడ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉంది కాబట్టే.. దాన్ని రాహుల్ గాంధీ ఖండించారని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనుకూల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లే.. ఇక్కడ సాగుతోన్న నరమేధాన్ని రాహుల్ గాంధీ ఖండించడం లేదని స్పష్టం చేశారు. కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్.. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే.. ఆయన చరిత్రను వల్లె వేశారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎస్కోబార్ సన్నిహితుడు కావడం వల్లే చంద్రబాబు ఆయన పేరును కలవరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా సాగుతోన్న డ్రగ్స్ దందాను బట్టి చూస్తే ఎస్కోబార్ చంద్రబాబుకు సన్నిహితుడేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment