ప్రేమజంట ఆత్మహత్య
జహీరాబాద్: రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జహీరాబాద్ మండలం తూంకుంట గ్రామ శివారులోని రైల్వేట్రాక్‌పై మంగళవారం వెలుగుచూసింది. రాయికోడ్ మండలం కుస్నూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి (23), వీరమణి (18) దూరపు బంధువులు. వరుసకు బావ, మరదలు అవుతారు. ఒకే ఊరు కావడంతో పాటు వారి ఇళ్లు కూడా సమీపంలోనే ఉంటాయి. ప్రభాకర్‌రెడ్డి నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో అప్రెంటీస్ చేస్తున్నాడు. వీరమణి రాయికోడ్‌లోని జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కోసం ఏడాది ఆగాలని ఇరు కుటుంబాల సభ్యులు సూచించారు. ఏమైందో ఏమో కానీ.. సోమవారం సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి, వీరమణి కలసి బయటకు వెళ్లారు. అదేరోజు రాత్రి వీరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నవారికి కడుపుకోత..
కన్నవాళ్లకి కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెళ్లికి పెద్దలు ఏడాది గడువు విధించారు. ఆ తరువాతనైనా పెళ్లికి అంగీకరిస్తారో లేదోననే అనుమానంతోనే వీరు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పెళ్లికి అంత తొందరేమొచ్చింది?.. గట్టిగా అడిగితే పెళ్లి చేసేవారం కదా అంటూ.. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ ఆయా కుటుంబాల వారు గుండెలవిసేలా రోదించారు.
ఆర్టీసీ సమ్మెతో ఇంటికొచ్చి..
ప్రభాకర్‌రెడ్డి ఐటీఐ పూర్తి చేసి నారాయణఖేడ్ డిపోలో పది నెలలుగా అప్రెంటీస్ చేస్తున్నాడు. వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఉప్పల్ డిపోకు వెళ్లాడు. అంతలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, ఇరువురి ప్రేమ వ్యవహారం తమకు తెలియదని వీరమణి తండ్రి నాగిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సోదరుడు జైపాల్‌రెడ్డి తెలిపారు.
టీసీ తెచ్చుకుంటానని వెళ్లి..
కళాశాలలో టీసీ తెచ్చుకుంటానని వీరమణి సోమవారం ఇంటినుంచి బయలు దేరింది. అనంతరం ప్రభాకర్‌తో కలిసి జహీరాబాద్ చేరుకుని రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని బంధువులు, రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ప్రభాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ లభించడంతో.. మృతుల గుర్తింపు సులభమైంది.
కుస్నూర్‌లో విషాదఛాయలు
రాయికోడ్ మండలం కుస్నూరుకి చెందిన ప్రభాకర్‌రెడ్డి, వీరమణి ఆత్మహత్య ఉదంతంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్థులు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుని స్థిరపడతారని భావించామని, ఇలా తనువు చాలిస్తారని ఊహించలేదని ఇరువురి కన్నీరుమున్నీరయ్యారు. ప్రభాకర్‌రెడ్డి తండ్రి నాగిరెడ్డి రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.