
ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్‌పై నిలబడిన ప్రేమజంట
కరీమాబాద్ : రైలు పట్టాల మధ్య నిలబడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ ప్రేమ జంటను ట్రాఫిక్ హోంగార్డు కాపాడిన సంఘటన నగరంలోని హంటర్‌రోడ్డు రైల్వే మినీ బ్రిడ్జి ట్రాక్‌పై జరిగింది. ట్రాఫిక్ హోంగార్డు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని వరంగల్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ప్రేమికులు(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) బుధవారం ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్య చేసుకునేందుకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు.
అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు రవి ఇది గమనించి వారిని ఆత్మహత్య చేసుకోవద్దని వారించడంతో పాటు ట్రాక్ మీద నుంచి బలవంతంగా పక్కకు కిందకు తీసుకెళ్లాడు.అక్కడే ప్రేమికులిద్దరికి తనతో పాటు స్థానికులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు హోంగార్డు రవి వివరించారు. ప్రేమపెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు వారు చెప్పారని రవి తెలిపాడు. కాగా సమయానికి స్పందించి ప్రేమ జంటను కాపాడిన హోంగార్డు రవిని పలువులు అభినందించారు.

హోంగార్డు రవి