
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయుక్తంగా కుల, మతాలకు అతీతంగా అంతిమ సంస్కారాన్ని కేవలం రూపాయి ఖర్చుతో ముగించేలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) తీసుకున్న నిర్ణయానికి జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తున్నా యి. ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి బంధువులు శ్మశానవాటికలో రూపాయి చెల్లించి రసీదు తీసుకుంటే అంతిమ సంస్కారానికి అవసరమైన సామగ్రిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఆఖిరి సఫర్ ముగిసిన తరువాత 50 మంది బంధువులకు రూ.5కే భోజన ఏర్పా ట్లు కూడా కార్పొరేషనే చేయనుంది.
కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం ప్రకటించిన ఈ పథకం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును ఆకర్షించింది. ఈ పథకం కోసం రూ.1.5 కోట్లు కేటాయించినందుకు మేయర్ రవీందర్‌సింగ్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించారు. 50 మంది కుటుంబసభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ పథకంపై స్పందిస్తూ కరీంనగర్ మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. ఇది తమ ఆప్తులకు అంతిమ సంస్కారాలు చేసే పేదలకు ఎంతో ఉపశమనమని పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్‌తో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వేగంగా స్పందించారు. తక్షణమే మున్సిపాలిటీల్లో కరీంనగర్ తరహాలో ‘అంతిమ సంస్కారం’ పథకం అమలుకు ప్రయత్నించనున్నట్లు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.