మానేరు డ్యాం వద్ద నుంచి సభకు ర్యాలీగా వెళ్తున్న కేటీఆర్, వినోద్, కౌశిక్‌రెడ్డి, రసమయి, గంగుల
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ.. భరతమాతకు బువ్వపెట్టే నాలుగో రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రం, చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.1,100 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లో రూ.410 కోట్లతో నిర్మించతలపెట్టిన మానేరు రివర్‌ఫ్రంట్, రూ.615 కోట్లతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు, 24 గంటల నీటిసరఫరా, జంక్షన్ల అభివృద్ధి, కమాండ్ కంట్రోల్ తదితర పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను కరీంనగర్‌లోనే పుట్టి పెరిగానని, తన విద్యాభ్యాసం, చదివిన స్కూళ్లను గుర్తుచేసుకున్నారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పటి కరీంనగర్ అభివృద్ధిలో ఎంతో మార్పు చెందిందన్నారు. తనకే కాదు సీఎం కేసీఆర్‌కు కూడా కరీంనగర్ అంటే ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అందుకే ఉద్యమానికి ఊపిరిలూదిన సింహగర్జన సభను ఇక్కడ నుంచే ప్రారంభించారని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే వారన్నారు. అందుకే.. ఈరోజు లక్షలాదిమంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు పింఛన్లు అందుకుంటున్నారని, వారి అవసరాలు తీర్చేవిధంగా సాయం చేసి గౌరవప్రదంగా జీవించేలా చేస్తున్నారని కొనియాడారు.
అదేవిధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతో మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతిని మెచ్చుకుంటూ నీతి ఆయోగే కితాబిచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా కేసీఆర్ గొప్పతనమే అన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు.. అయినా ఒకేరోజు భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత పురోగతిపై తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు.
మతవిద్వేషాలు చిమ్మడమే బండి పని!
కేటీఆర్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము ఇక్కడ చేసిన వెయ్యి పనుల గురించి అనర్గళంగా చెప్పగలమని, మరి ఇక్కడ గెలిచిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇంతవరకు రూ.3 కోట్ల పనులైనా చేశారా? అని నిలదీశారు. ‘తన పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కనీసం మూడు పైసల పనిచేసుడు తెల్వదు కానీ, తెల్లారి లేస్తే డైలాగులు కొట్టడం మాత్రం బాగా తెలుసు’అని విమర్శించారు. చేతనైతే కాళేశ్వరానికి జాతీయ హోదా, కరీంనగర్‌కు ట్రిపుల్‌ఐటీ, సిరిసిల్లకు మెగాపవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని సవాల్ విసిరారు. మాట్లాడితే హిందూ–ముస్లిం అంటూ మతాల మధ్య విద్వేషాలు చిమ్మడం తప్ప ఆయనకేమీ తెలియదని ఎగతాళి చేశారు. ఏదో అప్పుడు గాలికి గెలిచిన బండి.. ఢిల్లీలో ఇప్పుడు తన పలుకుబడితో రాష్ట్రానికి ఒక్క పనైనా చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న రూపాయిలో 50 పైసలే వెనక్కి వస్తున్నాయని.. మిగిలిన 50 పైసలు యూపీ, బిహార్‌లో ఖర్చవుతున్నాయని అన్నారు. ఇప్పటికే రెండుసార్లు గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన బండి సంజయ్, ఈసారి దమ్ముంటే ఆయనపై గెలవాలని సవాల్ విసిరారు. ఈసారి లక్ష ఓట్లతో గంగులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతారో చెప్పాలి..
అనంతరం మంత్రి చొప్పదండిలో దాదాపు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొంతకాలంగా కొందరు సీఎం కేసీఆర్‌ను ఇష్టానుసారంగా తూలనాడుతున్నారని మండిపడ్డారు. ‘మరికొందరు కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని, దింపేస్తామని అంటున్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని జైలుకు పంపిస్తారు’అని ప్రశ్నించారు. ‘24 గంటల కరెంట్ ఇస్తున్నందుకా? రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నందుకా? రైతుబీమా ఇస్తున్నందుకా? కాళేశ్వరం కట్టినందుకా?’అంటూ ప్రశ్నించారు. చొప్పదండికి సైనిక్ స్కూల్ కావాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని అడిగితే ఎందుకు తేలేదని బండి సంజయ్‌ని నిలదీశారు. వేములవాడకు ఏమైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది టీఆర్‌ఎసే అన్న విషయం మరిచిపోవద్దని కోరారు.
నలుగురు బీజేపీ ఎంపీలు దద్దమ్మలు
బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదని, నమ్మించి మోసం చేయడమే ఆ పార్టీ పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. హిందూ, ముస్లిం లొల్లి తప్ప అభివృద్ధి మంత్రం ఆ పార్టీకి పట్టదని ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఆ«ధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీకి చెందిన కార్పొరేటర్లు మెండి శ్రీలత చంద్రశేఖర్, నక్క కృష్ణ పద్మ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో దేశం గందరగోళంలో ఉందని, యువతను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు దద్దమ్మలు, సన్నాసులని, కేంద్రం నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకురాని వారు పెద్దపెద్ద డైలాగులు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో వరదబాధితులకు నయా పైసా తేలేదని, అలాగే గతంలో మంజూరైన పథకాలు వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపుబోర్డు తెస్తానన్న వాగ్దానానికి ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. మరో ఎంపీ సోయం బాపురావు చెప్పిన ట్రైబల్ యూనివర్సిటీ హమీ కలగానే మిగిలిందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment