
ప్రాణం తీసిన సరదా
ఆటో నడపాలన్న సరదా ఓ విద్యార్థి ప్రాణం తీయగా, మరో ఇద్దరిని గాయాలుపాలు చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ముద్దాయిపేట చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.
పుల్‌కల్: ఆటో నడపాలన్న సరదా ఓ విద్యార్థి ప్రాణం తీయగా, మరో ఇద్దరిని గాయాలుపాలు చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ముద్దాయిపేట చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం...పుల్‌కల్ మండలంలోని సింగూర్ గురుకుల పాఠశాలలో 9వ చదువుతున్న ప్రవీణ్‌ను చూసేందుకు ఆదివారం అతని తల్లిదండ్రులు ఆటోలో వచ్చారు.
ఆటోను గురుకుల పాఠశాల ఆవరణలో నిలిపి ప్రవీణ్‌తో మాట్లాడుతుండగా, ప్రవీణ్‌తో పాటు గురుకుల పాఠశాలలో చదువుతున్న రాయికోడ్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్(14), సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన ఉదయ్, అందోల్ గ్రామానికి చెందిన రవిలు ఆటో నడపాలన్న సరదాతో తన స్నేహితుని తల్లిదండ్రులు తెచ్చిన ఆటోను తీసుకువెళ్లారు. అయితే ముద్దాయిపేట చౌరస్తా వద్ద ఆ ఆటో ఓ చెట్టుకు గుద్దుకుని బోల్తా పడింది.
ఈ ఘటనలో సుదర్శన్ తీవ్రంగా గాయపడగా, ఉదయ్, రవిలు స్వల్పంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు విద్యార్థులను అదే ఆటోలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సుదర్శన్ మృతి చెందాడు. దీంతో వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం సుదర్శన్ మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ లోకేష్‌ను వివరణ కోరగా, రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని వెల్లడించారు.