ఇక పోరు ఖరారు | Mahabubnagar All MLA Candidates List | Sakshi
Sakshi News home page

ఇక పోరు ఖరారు

Published Mon, Nov 19 2018 8:26 AM | Last Updated on Mon, Nov 19 2018 8:26 AM

Mahabubnagar All MLA Candidates List - Sakshi

అసెంబ్లీ ఎన్నికల పోరులో కీలకమైన టికెట్ల కేటాయింపు ప్రక్రియ వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ జడ్చర్ల, కొల్లాపూర్‌ స్థానాలకు మధుసూదన్‌యాదవ్, సుధాకర్‌రావు పేర్లు ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌లో దేవరకద్ర, నారాయణపేట టికెట్ల కేటాయింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరకు దేవరకద్ర టికెట్‌ను పవన్‌కుమార్‌రెడ్డికి కేటాయించగా.. నారాయణపేట టికెట్‌ ఆశించిన కుంభం శివకుమార్‌రెడ్డికి చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని గత ఎన్నికల్లో పోటీ చేసిన సరాఫ్‌ కృష్ణకే కేటాయించిన అధిష్టానం ఆదివారం అర్ధరాత్రి  తుది జాబితాను విడుదల చేసింది.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ బరిలో నిలిచి పోరాడేదెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారయ్యారు. రెండు స్థానాలను పెండింగ్‌లో ఉంచిన బీజేపీ ఆదివారం సాయంత్రం పేర్లు ప్రకటించింది. కొల్లాపూర్‌ నుంచి సుధాకర్‌రావు, జడ్చర్ల నుంచి మధుసూదన్‌యాదవ్‌ను ఖరారు చేసింది. మరోవైపు మహాకూటమి అభ్యర్థుల అంశం ఆద్యంతం అత్యంత ఉత్కంఠతకు గురిచేసింది. చివరికి ముందు నుంచి అనుకున్నట్లుగానే ప్రచారంలో ఉన్న వారి పేర్లనే కాంగ్రెస్‌ అధిష్టానం వెల్లడించన్నుట్లు తెలుస్తోంది. దేవరకద్ర నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన డోకూరు పవన్‌కుమార్, నారాయణపేట నుంచి వామనగిరి కృష్ణ(సరాఫ్‌ కృష్ణ) పేర్లను ఖరారు చేశారు.

ఈ మేరకు జాబితా ఆదివారం అర్ధరాత్రి వెల్లడైంది. కానీ నారాయణపేట నుంచి కుంభం శివకుమార్‌రెడ్డి టికెట్‌ ఆశించినా ఆయనకు దక్కలేదు. ఇలా మొత్తం మీద ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం విషయంలో కూటమి పొత్తులు, లెక్కలు అంతు చిక్కడం లేదు. ఈ స్థానం నుంచి ఇది వరకే కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి ఎర్రశే ఖర్‌కు కేటాయించగా.. తాజాగా ఇదే స్థానం నుంచి తెలంగాణ జన సమితి నుంచి జి.రాజేందర్‌రెడ్డికి పార్టీ బీ–ఫాం అందజేశారు. ఇలా ఒకే స్థానం నుంచి కూటమిలోని రెండు పార్టీలు టికెట్లు కేటాయించడంతో పాటు పార్టీ బీ–ఫాంలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

పోరు హోరాహోరీ 
ముందస్తు ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల విషయంలో స్పష్టత రావడంతో పోటీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏయే నియోజకవర్గంలో ఎవరెవరికి పోటీ ఉంటుందనేది చర్చనీయాంశమైంది. అందరికంటే ముందుగా టీఆర్‌ఎస్‌ రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నాలుగు విడుతలుగా అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు పోరు అంతా ఏకపక్షంగా ఉంటుందని భావించగా... వాస్తవ పరిస్థితి అలా లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా మహాకూటమి అభ్యర్థులు చాలా చోట్ల టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ సూత్రాన్ని అవలంభించిందో.. కాంగ్రెస్‌ కూడా దాదాపు అదే దారిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులందరూ కూడా గతంలో తలపడిన వారే కావడం గమనార్హం. దీంతో ఎవరి బలాలు, బలహీనతలు ఏమిటనేది తెలుసుకున్నారు. దీంతో ఎవరికి వారు మైండ్‌ గేమ్‌తో తమ ప్రచారానికి పదును పెడుతున్నారు. అలాగే కొన్ని స్థానాల్లో బీజేపీ సైతం కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్‌ వంటి స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.

తీవ్ర ఉత్కంఠ 
రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ కాస్త బలంగా ఉందని భావిం చే ఉమ్మడి పాలమూరు జిల్లాలో టికెట్ల ఎంపిక ప్రక్రియ ఆ పార్టీ అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి చివరి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ముఖ్యం గా మూడు స్థానాల విషయంలో రెండు గ్రూపుల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దేవరకద్ర, నారాయణపేట, కొల్లాపూర్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇరు వర్గాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. కొల్లాపూర్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌కు టికెట్‌ కేటాయించాలని డీకే.అరుణ, జగదీశ్వర్‌రావుకు కేటాయించాలని జైపాల్‌రెడ్డి పట్టుబట్టారు. చివరికి డీకే.అరుణ పంతమే నెగ్గింది. ఇక దేవరకద్ర, నారాయణపేట స్థానాలకు ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఇరువర్గాలు తలపడ్డాయి. అయి తే, చివరి జాబితాలో డీకే.అరుణ వర్గానికి చెందిన డోకూరు పవన్‌కుమార్‌కు దేవరకద్ర, జైపాల్‌ వర్గానికి చెందిన సరాఫ్‌ కృష్ణకు నారాయణపేట స్థానం ఖరారైంది. దీంతో ఈ స్థానం ఆశించిన శివకుమార్‌రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారన్న సోమవారం తేలనుంది.

మహబూబ్‌నగర్‌లో ఫ్రెండ్లీ పోటీ 
మహాకూటమి పొత్తులు, లెక్కలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ స్థా నానికి మొదటి నుంచి తీవ్రమైన పోటీ ఉంది. పోటీకి దిగేందుకు కాంగ్రెస్‌ నుంచి నలుగురు పోటీ పడ్డారు. కానీ పొత్తులో భాగంగా సీటును టీడీపీకి కేటాయించారు. ఈ మేరకు ఎర్ర శేఖర్‌ పే రు ఖరారైంది. అయితే ఇదే స్థానం కోసం మొదటి నుంచి పట్టుబడుతున్న టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసిన రాజేందర్‌రెడ్డి.. ఆదివారం కోదండరాం చేతుల మీదుగా బీ–ఫాం సైతం అందుకున్నారు. దీంతో పోటీ విషయం మళ్లీ మొదటికి వచ్చింది. స్నేహపూర్వక పోటీలో భాగంగా రెండు పార్టీల అభ్యర్థులు కూడా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉంటే కూటమిలో భాగంగా ఏ పార్టీకి గుర్తింపు ఇస్తారనేది రాజకీయ పరిశీలకులు కూడా తేల్చలేకపోతున్నారు.

దేవరకద్ర, నారాయణపేట కాంగ్రెస్‌ అభ్యర్థులు డోకూరు పవన్‌కుమార్, సరాఫ్‌ కృష్ణ

నియోజకవర్గాలు, పార్టీల వారీగా అభ్యర్థులు వీరే.. 

నియోజకవర్గం    టీఆర్‌ఎస్‌            మహాకూటమి               బీజేపీ 
జడ్చర్ల           డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి     డాక్టర్‌ మల్లు రవి        మధుసూదన్‌యాదవ్‌ 
కొల్లాపూర్‌     జూపల్లి కృష్ణారావు      బీరం హర్షవర్దన్‌రెడ్డి       సుధాకర్‌రావు 
గద్వాల్‌      బి.కృష్ణమోహన్‌రెడ్డి      డీకే అరుణ                  వెంకటాద్రిరెడ్డి 
కొడంగల్‌      పి.నరేందర్‌రెడ్డి          ఎ.రేవంత్‌రెడ్డి                 నాగూరావు నామాజీ 
వనపర్తి        ఎస్‌.నిరంజన్‌రెడ్డి        జి.చిన్నారెడ్డి                కె.అమరేందర్‌రెడ్డి 
మహబూబ్‌నగర్‌    వి.శ్రీనివాస్‌గౌడ్‌     ఎర్ర శేఖర్‌ / రాజేందర్‌రెడ్డి    పద్మజారెడ్డి 
నాగర్‌కర్నూల్‌     మర్రి జనార్దన్‌రెడ్డి     నాగం జనార్దన్‌రెడ్డి        దిలీప్‌ ఆచారి 
అచ్చంపేట     గువ్వల బాల్‌రాజు        డాక్టర్‌ వంశీకృష్ణ           మల్లీశ్వర్‌ 
దేవరకద్ర     ఆల వెంకటేశ్వర్‌రెడ్డి         డోకూరు పవన్‌కుమార్‌     ఎగ్గని నర్సింహులు 
మక్తల్‌           చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి     కె.దయాకర్‌రెడ్డి            ఎం.కొం డయ్య 
నారాయణపేట    రాజేందర్‌రెడ్డి           సరాఫ్‌ కృష్ణ                   రతంగ్‌పాండురెడ్డి 
కల్వకుర్తి       జైపాల్‌యాదవ్‌          వంశీచంద్‌రెడ్డి                  తన్నోజు ఆచారి 
అలంపూర్‌      డాక్టర్‌ అబ్రహం          సంపత్‌కుమార్‌                రజనీరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement