టెన్షన్‌.. టెన్షన్‌ | Mahakutami Candidates Tension On Tickets In Election | Sakshi
Sakshi News home page

టెన్షన్‌.. టెన్షన్‌

Published Wed, Nov 14 2018 4:15 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Mahakutami Candidates Tension On Tickets In Election - Sakshi

ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం.. నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్, ఎల్లారెడ్డి స్థానాలకు తేల్చలేదు. మహా కూటమి పొత్తులో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయించే అవకాశాలు ఉండటంతో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్‌ ఆశావహుల్లో టెన్షన్‌ నెలకొంది. రూరల్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి చెందిన మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి బాల్కొండ స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

సాక్షి ,నిజామాబాద్‌: మహాకూటమిలో టిక్కెట్ల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి టీడీపీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తుండటం తో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్‌ ఆశావహు ల్లో టెన్షన్‌ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన జాబితాలో బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, జుక్కల్‌ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్, ఎల్లారెడ్డి స్థానాలకు అభ్యర్థులెవరో తేల్చలేదు. అయితే నిజామాబాద్‌ రూరల్‌తో పాటు, బాల్కొండ స్థానాలపై టీడీపీ కన్నేసిన విషయం విదితమే. రూరల్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ టికెట్‌ను ఆశిస్తున్న డాక్టర్‌ భూపతిరెడ్డి, అర్కల నర్సారెడ్డిల్లో టెన్షన్‌ నెలకొంది.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భూపతిరెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా, రేవంత్‌రెడ్డి ద్వారా అర్కల టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌రూరల్‌ స్థానం టీడీపీకి కేటాయిస్తారనే అంశం తెరపైకి రావడంతో ఇటు ఆ పార్టీ వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. జిల్లాలో బాల్కొండ స్థానానికి కూడా అధిష్టానం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి అనీల్‌ టికెట్‌ రేసులో ఉండగా, టీడీపీ కోటాలో కాంగ్రెస్‌ గుర్తుపై పోటీ చేసేందుకు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి ఆశిస్తున్నారు. సైకిల్‌ గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు బదిలీ కావడం అసాధ్యమని భావిస్తున్న మల్లికార్జున్‌రెడ్డి కాంగ్రెస్‌ గుర్తుపై బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. టీడీపీకి చెందిన మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

 ఆసక్తికరంగా అర్బన్‌ రాజకీయాలు.. 

నిజామాబాద్‌ అర్బన్‌లోనూ కాంగ్రెస్‌ టికెట్ల గోల ఆ పార్టీ వర్గాలను గందరగోళానికి గురి చేస్తోంది. అర్బన్‌ స్థానాన్ని కూటమిలో భాగస్వామ్య పార్టీలు కోరడం లేదు. కానీ అధిష్టానం మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. బొమ్మా మహేష్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్, రత్నాకర్‌ పేర్లు ప్రారంభంలో వినిపించినప్పటికీ.. ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది

ఎల్లారెడ్డిపై రేవంత్‌వర్గం పట్టు.. 

ఎల్లారెడ్డి స్థానానికి నల్లమడుగు సురేందర్, సుభాష్‌రెడ్డి ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గీయుడైన సుభాష్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈస్థానంతోపాటు మిగతా మూడు స్థానాలను ఎవరికి కేటాయిస్తారనేది బుధవారం తేలనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement