‘పీఠం’కోసం... | main parties effort for municipal chairman | Sakshi
Sakshi News home page

‘పీఠం’కోసం...

Published Tue, May 27 2014 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

main parties effort for municipal chairman

 సాక్షి, ఖమ్మం: ఫలితాలు వెలువడి... విజయం సాధించినా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ముఖాన చిరునవ్వులేదు. చైర్మన్ పీఠం దక్కించుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిరలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వార్డులు దక్కించుకున్న పార్టీలకు స్వతంత్రులు, ఇతర పార్టీల పొత్తులే కీలకం అయ్యాయి.  

  సత్తుపల్లిలో టీడీపీకి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చినా ఆ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎవరికి చైర్మన్ పదవి కట్టబెట్టాలోనని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిరలో ఏ పార్టీ, కూటమికి చైర్మన్ పీఠం దక్కించుకునే మెజారిటీ లేకపోవడంతో ఇక్కడ రాజకీయం రసకందాయంగా మారింది. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడిన వారం రోజుల్లో చైర్మన్ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ ముగియనుంది. చైర్మన్ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారు పదవి దక్కించుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. క్యాంపు రాజకీయాలకు స్థానిక ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంతో ఇప్పటికే చైర్మన్ పదవి కోసం ఖర్చు చేసిన వారు తమ భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

 ఇల్లెందులో సీపీఐ కలిసివచ్చేనా..?
 ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో బరిలో దిగాయి. మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 8, సీపీఐ 3 వార్డులు దక్కించుకున్నాయి. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే ఈ కూటమికి ఇంకా ఇద్దరు వార్డు సభ్యుల మద్దతు అవసరం. స్వతంత్రులు ఆరుగురు విజయం సాధించారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. మొత్తం 14 మంది సభ్యులతో కాంగ్రెస్ ఇక్కడ చైర్మన్ గిరి దక్కించుకునే అవకాశం ఉన్నా.. సీపీఐ కలిసి వస్తుందా..?లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

 సీపీఐ, కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా సీపీఐ తరఫున బరిలోకి దిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు కాంగ్రెస్ ఏడు నియోజకవర్గాల్లో సహకరించలేదనే చర్చసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చైర్మన్ గిరి విషయంలో కాంగ్రెస్‌కు సహకరించేది లేదని సీపీఐ నేతలు అంటున్నట్లు తెలిసింది. పనిలో పనిగా టీడీపీ, సీపీఐ, స్వతంత్రుల మద్దతుతో టీఆర్‌ఎస్ కూడా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి తెరచాటు రాజకీయాలకు దిగింది. సీపీఐ ప్లేటు ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఉన్న మడత రమ పరిస్థితి ఏంటి అనే దానిపైనా చర్చ కొనసాగుతోంది.

 మధిర పీఠం ఎవరిదో..?
 మధిరలో కాంగ్రెస్, సీపీఐ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటములుగా బరిలోకి దిగాయి. టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఏ కూటమి, పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్నా 11 వార్డులు రావాలి. కానీ ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దొడ్డిదారిలోనైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూటమికి ఆరు స్థానాలు రాగా టీడీపీతో పొత్తుతో చైర్మన్ పదవిని పంచుకోవాలని ఆపార్టీ నాయకులు రహస్యంగా చర్చలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చైర్మన్ అభ్యర్థులుగా నండు శారమ్మ, మొండితోక నాగరాణి, టీడీపీ నుంచి ఎల్లంకి సునిత, లక్ష్మీలు ఆశ పెట్టుకున్నారు. రెండు పార్టీలు చెరి రెండున్నరేళ్లు చైర్మన్ పీఠాన్ని పంచుకోవాలన్న యోచనలో ఉన్నాయి. ఈ పొత్తును నగర పంచాయతీలోని ద్వితీయశ్రేణి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 ‘గూడెం’పై ఉత్కంఠ..
 కొత్తగూడెంలో 33 వార్డుల్లో కాంగ్రెస్, టీడీపీ ఒంటరి పోరు చేయగా, సీపీఐ, టీఆర్‌ఎస్ పొత్తుతో బరిలో దిగింది. 33 వార్డుల్లో కాంగ్రెస్ 12 వార్డులు, టీడీపీ 4, సీపీఐ, టీఆర్‌ఎస్ కూటమి 9, వైఎస్సార్‌సీపీ 1, స్వతంత్రులు 7 స్థానాల్లో విజయం సాధించారు. మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీలోకి రావడంతో రాజకీయ సమీకరణలు మారాయి. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన వారు కొంతమంది టీఆర్‌ఎస్ వైపు చూస్తుండగా.. మరికొంత మంది వైఎస్సార్‌సీపీకి జై కొడుతున్నారు. సీపీఐ చైర్మన్ అభ్యర్థి ఓటమిపాలు కావడం, టీడీపీకి తక్కువ వార్డులు రావడంతో చైర్మన్ పీఠం దక్కాలంటే ఇక్కడ గెలుపొందిన స్వతంత్రులే ఏపార్టీకైనా కీలకం. టీఆర్‌ఎస్ అన్ని పార్టీల వార్డు సభ్యులను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండడంతో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కతాటి పైకి రావాలన్న ఆలోచనతో రాజకీయాలు సాగుతున్నాయి.

 మెజారిటీ ఉన్నా..
 సత్తుపల్లి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో 17 వార్డులు టీడీపీ కైవసం చేసుకున్నా చైర్మన్ పీఠం ఆ పార్టీలో ఇప్పుడు వర్గ రాజకీయాలకు తెరలేపింది. పార్టీ అధికారికంగా ప్రకటించిన చైర్మన్ అభ్యర్థి, తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేసిన కందిమళ్ల నాగేశ్వరమ్మ ఓడిపోయారు. 14వ వార్డులో గెలుపొందిన దొడ్డాకుల స్వాతి, 19 వ వార్డు నుంచి వెలిశాల సత్యవతి చైర్‌పర్సన్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఎవరికివారు ఇటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అటు పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ తమకే పదవి దక్కేలా చూడాలని ప్రదక్షిణలు చేస్తున్నారు. దొడ్డాకుల స్వాతికి తుమ్మల ఆశీస్సులు ఉండడంతో ఆమె అభ్యర్థిత్వం వైపు సండ్ర కూడా మొగ్గు చూపక తప్పదని ఆపార్టీలో ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement