
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమానురాగాలు పంచే ఆత్మీ య మాతృమూర్తితో మదర్స్‌డే రోజంతా గడిపేందుకు మెజార్టీ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారట. ఈ నెల 13న మదర్స్‌డే సందర్భంగా భారత్ మ్యాట్రిమోని సంస్థ 6,448 మంది స్త్రీ, పురుషుల అభిప్రాయాలను ఆన్‌లైన్‌లో సేకరించింది. ఇందులో 80 శాతం మంది మదర్స్‌డేను జరుపుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు ఈ సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మదర్స్‌డే రోజున తల్లితో రోజంతా గడిపేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. అమ్మతో కలిసి లంచ్, డిన్నర్ చేయడం, షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట.
ఇక ఈ సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది యువతీ, యువకులు మదర్స్‌డే రోజున ఇంటిపని, వంట పనులతో సతమతÐమవుతున్న అమ్మకు విశ్రాంతినిస్తే ఆమె సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడటం విశేషం. 40 శాతం మంది పురుషులు అమ్మకు అధిక తీరిక సమయం అవసరమని అభిప్రాయపడగా.. 30 శాతం మంది స్త్రీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పిల్లల సంతోషమే తల్లికి ఆనందం కలిగిస్తుందని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడినట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించిన భారత్ మ్యాట్రిమోని మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ తెలిపారు.