సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో ఓటమిపాలైన మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం గురించి రంగారెడ్డి తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేష్ ముంజాల్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
తమ అభ్యర్థన గురించి ధర్మాసనానికి వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ గురించి ఆరా తీసింది. ఈ పిటిషన్ గురించి ముం దస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆ సమయానికి అవినాశ్ కోర్టులో లేరు. దీంతో ధర్మాసనం పిటిషనర్ అభ్యంతరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని తమకు చెప్పాలని అవినాశ్‌కు స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. తాము ఇచ్చిన ఈ ఆదేశాల గురించి అవినాశ్‌కు తెలియచేయాలని అక్కడే ఉన్న ప్రభుత్వ న్యాయవాదులకు సూచించింది.
ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయి..
ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు. పోలింగ్ స్టేషన్ 199, 221ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను, ఈవీఎంలను పోల్చిచూడగా, ఈవీఎంల ప్రకారం టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 146 ఓట్లు, తనకు 130 ఓట్లు వచ్చాయని, ఇదే సమయంలో వీవీ ప్యాట్‌లను లెక్కించగా, మంచిరెడ్డికి 139 ఓట్లు, తనకు 129 ఓట్లు వచ్చాయన్నారు. 221 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిటర్నింగ్ అధికారి రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలను ప్రకటించారని పేర్కొన్నారు.
మాక్ పోలింగ్ డేటాను తుడిచేయకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు. దీనిపై సీఈవోను కలిసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా, రిటర్నింగ్ అధికారి కార్యాలయం కీలక సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. పోలింగ్ పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్‌లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment