మలేరియా కోరల్లో ఆదిలాబాద్ ఏజెన్సీ..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మలేరియా మహమ్మారి పొంచి ఉంది. గతేడా ది అనేక మంది ఆదివాసీల ప్రాణాలు బలిగొన్న ఈ వ్యాధి ఈ ఏడాది కూడా విజృంభించడం ఖాయమని కేంద్ర వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని నేషనల్ వెక్టర్న్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్‌వీబీడీసీపీ) ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఈ విభాగం తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారిణి డాక్టర్ సుమన్‌లతా వక్తల్ ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ వ్యాధి విజృంభించే మండలాల్లో ఆమె పరిస్థితిని పరిశీలించారు. అలాగే, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎన్‌వీబీడీసీపీ ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. మలేరియా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. తెలంగాణలో అత్యధిక మరణాలుండే ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
ఏటా మరణమృదంగమే..
జిల్లాలో గోండు గూడాలు, గిరిజన తండాల్లో ఏటా మరణ మృదంగం వినిపిస్తోంది. గతేడాది కూడా ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. ఒక్క గూడెంలోనే పదుల సంఖ్యలో జ్వరాలతో బాధపడ్డారు. వందలాది గ్రామాల్లో విషజ్వరాలు విజృంభించాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా వారాల తరబడి మంచానికే పరిమితమయ్యారు. ఈ జ్వరాల బారిన పడి పలువురి ప్రాణాలు సైతం గాలిలో కలిశాయి. గతేడాది ఇలాగే హైరిస్క్ గ్రామాలను వైద్యారోగ్య శాఖ గుర్తించింది. తీరా ఎపిడమిక్ సీజను ముంచుకొచ్చాక ఈ హైరిస్క్ గ్రామాలసంఖ్య అంచనాలకు మించిపోవడంతో వైద్యారోగ్య శాఖ దాదాపు చేతులెత్తేసింది. ఇలా ఏటా వైరల్ జ్వరాల బారిన పడి అనేక మంది ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరి కలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హై రిస్క్‌లో 924 గ్రామాలు..
గతేడాది వర్షాకాలంలో మలేరియా వ్యాధి బారిన పడి 58 మంది ఆదివాసీలు మరణించినట్లు ఆదిలాబాద్ రిమ్స్ ప్రకటించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆదివాసీలను రిమ్స్‌కు తరలించిన వారిలోనే 58 మరణాలున్నాయంటే.. వెలుగుచూడని మరణాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వైద్యారోగ్య శాఖ మలేరియా విభాగం గణాంకాల మేరకు గతేడాది రక్త పరీక్షలు నిర్వహించిన వారిలో 9,198 మంది మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి తెలిపారు. మలేరియాతోనే మరణించినా కానీ, ఎక్కడ అధికారికంగా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. మలేరియా వ్యాధి పొంచి ఉన్న హైరిస్క్ గ్రామాలు జిల్లాలో 924 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ముఖ్యంగా నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి, ఆసిఫాబాద్, కెరమెరి, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర మండలాల్లో ఈ హైరిస్క్ గ్రామాలను గుర్తించారు.