
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ట అని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమని, కార్మికులు వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ దేశం ఇచ్చిన కార్మిక చట్టాల ద్వారా సమ్మె చేయడం ఒక భాగమని అన్నారు. ఈ మేరకు భట్టి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చూపడం ప్రభుత్వం బాధ్యత. సమ్మెకు దిగిన ఉద్యోగులతో చర్చలు జరపకుండా.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావనికి నిదర్శనం’ అన్నారు.
చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు..
రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పై అధిక పన్నులు వేసి ఆర్టీసీ నష్టాలకు కారణం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్టీసీ అనేది ప్రభుత్వం ఆస్తి. ఆ ఆస్తులను ప్రభుత్వం సంరక్షించాలి. కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయనలోని ఫ్యూడల్ మనసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఒక రాచరిక పరిపాలన చేస్తున్నట్లు ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలన చేస్తున్నట్లు లేదు. ఆర్టీసీ కార్మికులు తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్టీసీ వ్యవహారంలో ముఖ్యమంత్రి వ్యహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఆ సంస్థను హస్తగతం చేసుకునేందుకే అంతర్లీనంగా కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. కార్మికుల పక్షాన మేము నిలబడటం’ అని విక్రమార్క పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment