ప్రమాదానికి గురైన కారు, సంజీవయ్య(ఫైల్)
సాక్షి, గద్వాల అర్బన్(మహబూబ్ నగర్): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలోని జమ్మిచేడు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గద్వాల రూరల్ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. గద్వాల పట్టణానికి చెందిన సంజీవయ్య (41) మల్దకల్ మండలంలో విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆ శాఖ తరపున వరంగల్‌లో క్రీడలు నిర్వహిస్తుండగా మూడు రోజుల క్రితం సంజీవయ్యతో పాటు జూబేర్‌లో పోటీల్లో పాల్గొనేందుకు కారులో వెళ్లారు. తిరిగి పట్టణానికి వస్తుండగా.. మంగళవారం ఉదయం 7గంటలకు గద్వాల మండలంలోని జమ్మిచేడు హరిత హోటల్ ఎదుట వారి వాహనానికి పంది అడ్డు రాగా దానిని ఢీకొట్టి వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
దీంతో వాహనం నడుపుతున్న జుబేర్‌కు చెయ్యి విరగ్గా సంజీవయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి శవాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య శ్రీలతతో పాటు కుమారుడు వినయ్, కుమార్తె అక్షిత ఉన్నారు. ఇదిలాఉండగా, సంజీవ య్య మృతి చెందడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ చక్రపాణి, 1104 విద్యుత్ యూనియన్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు, గద్వాల ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment