
అయితే, ఆ పాటలో చెప్పినట్టు చివరికి మనల్ని మోయడానికి ‘ఆ నలుగురు’ కూడా కరువైపోవడం అత్యంత బాధాకరం.
సాక్షి, కామారెడ్డి: ‘ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధిలీలా. వెంట ఏ బంధము రక్త సంబంధమూ.. తోడుగా రాదుగా తుది వేళ’ తెలుగు సినిమాలోని ఈ పాట నేటి కరోనా పరిస్థితులకు అద్దం పడుతోంది. అయితే, ఆ పాటలో చెప్పినట్టు చివరికి మనల్ని మోయడానికి ‘ఆ నలుగురు’ కూడా కరువైపోవడం అత్యంత బాధాకరం. మహమ్మారి కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తాకడానికి కొందరు భయపడుతుంటే.. అసలు తమవారు మరణించినా పట్టించుకోనివారు మరికొందరు. కరోనా భయాల నేపథ్యంలో మృతదేహాలను జేసీబీలతో పూడ్చిపెట్టిన ఘటనలు బయటపడగా.. తల్లిదండ్రుల శవాలను కూడా చూసేందుకు రాని ఘటనలు మానవత్వానికి మచ్చగా మిగులుతున్నాయి.
(చదవండి: కరోనా విషాదం: తల్లి చూస్తుండగానే..)
కామారెడ్డి జిల్లాలో ఆదివారం బయటపడిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మెదక్ జిల్లా బురుగుపల్లికి చెందిన హనుమంతు(55) అనే పెద్దాయన ఈనెల 17న మృతి చెందారు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో బస్టాండ్ ఆవరణలోనే కూర్చుండిపోయారు. సుమారు గంట పాటు నరకయాతన అనుభవించారు. హనుమంతుకు కరోనా ఉందనే అనుమానాలతో స్థానికులులెవరూ ఆయన వద్దకు వెళ్లలేదు. చివరకు ఆర్టీసీ అధికారులు స్పందించి 108 కు సమాచారం ఇవ్వడంతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే, ఆయన కూతురు, తమ్ముని కొడుకులకు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు సమాచారం ఇచ్చినా వారు రాలేదు. దీంతో మున్సిపల్ సిబ్బందే హనుమంతు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ ఉన్నా అనాధగా మారిన హనుమంతు పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని మున్సిపల్ సిబ్బంది వ్యాఖ్యానించారు.
(కామారెడ్డి బస్టాండ్‌లో దారుణం.. పట్టించుకోని స్థానికులు)