
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొంత మంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. స్వీయనిర్బంధం పాటించాలని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. అలాంటి ఓ వ్యక్తిపై మలక్‌పేట పోలీసులకు స్థానికులకు ఫిర్యాదు చేశారు. క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్ బయట తిరుగుతున్నాడు. అపార్ట్‌మెంట్ వాసులు ఇలా తిరగొద్దని చెప్పినా వినకపోవడంతో ఆందోళన చెందిన ఆపార్ట్‌మెంట్ వాసులు మలక్‌పేట పోలీసులను ఆశ్రయించారు. (కోవిడ్ ఎఫెక్ట్: వారి కోసం ‘క్రౌడ్ ఫండింగ్’)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం దుబాయి నుంచి వచ్యిన ఓ వ్యక్తి సలీంనగర్‌లోని విజేత సఫైర్ అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తులో ఉంటున్నాడు. అతనికి మెడికల్ అధికారులు ముద్ర వేసి క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అయితే ఆ వ్యక్తి లిఫ్ట్‌లో తిరగడం గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు కుటుంబ సభ్యులకు, అతనికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. కార్పొరేటర్ తీగల సునరితరెడ్డి, ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు స్థలానికి చేరుకుని అతనికి అవగాహన కల్పించి, బయటకురావద్దని సూచించారు. అయినా తీరుమార్చుకోక పోవడంతో అపార్ట్‌మెంట్ వాసుల కోరిన మేరకు మెడికల్ సిబ్బంది పిలిచి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. (అత్యవసర సేవలకు పాసుల జారీ)
స్వీయ నియంత్రణ పాటించండి
అంబర్‌పేట: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు క్రమశిక్షణతో స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బుధవారం అంబర్‌పేట, గోల్నాక, బాగ్ అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ ప్రజలకు సూచించారు. కరోనా పట్ల ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలను ప్రజలు పాటించాలని కోరారు. అలాగే కొందరు వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారని గమనించి అలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్ తదితరులు ఉన్నారు. అలాగే బాగ్ అంబర్‌పేటలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కే.దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యవహరించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం)
Comments
Please login to add a commentAdd a comment