తల్లి రాజమ్మతో కొడుకు నంబయ్య
బెల్లంపల్లి: మతిస్థిమితం సరిగా లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు సరిగ్గా 22 ఏళ్లకు ఇల్లు చేరిన ఘటన బెల్లంపల్లిలో వెలుగుచూసింది. బాధితుడి తల్లి రాజమ్మ కథనం ప్రకారం... పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కపురం గ్రామానికి చెందిన కట్రాజుల రాజమ్మ, లక్ష్మయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. వీరిలో నంబయ్య పెద్ద కొడుకు. లక్ష్మయ్య బెల్లంపల్లిలో సింగరేణి ఉద్యోగం చేసేవాడు, పట్టణంలోని మహ్మద్ ఖాశీం బస్తీలో నివాసం ఉండేవాడు. పెద్ద కొడుకైన నంబయ్యకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అంతలోనే నంబయ్య మతి స్థిమితం కోల్పోయాడు. ఆ క్రమంలోనే 1997లో బెల్లంపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్లిన నంబయ్య ఆకస్మికంగా ఓ గుర్తు తెలియని రైలును పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు నంబయ్య కర్ణాటక రాష్ట్రంలో మతిస్థిమితం లేకుండా సంచరించాడు. ఆ తర్వాత కేరళ రాష్ట్రానికి వెళ్లి పోయాడు. కేరళ వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలో తనకు తానుగా తెలుగు మాట్లాడుకుంటుండగా అక్కడ నివాసం ఉంటున్న తెలుగు వారు ఆదరించి నర్సయ్యను ఓ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్పించారు.
మూడేళ్ల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన నంబయ్య మతిస్థిమితం నుంచి బయటపడ్డాడు. ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత ఆయనకు ఇంటి ధ్యాస పట్టింది. ఇళ్లు, తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో అక్కడి తెలుగువారు నెమ్మదిగా బెల్లంపల్లి ఇంటి అడ్రస్‌ను తెలుసుకుని నంబయ్యను శుక్రవారం క్షేమంగా ఇంటికి చేర్చారు. 22 ఏళ్ల క్రితం ఇంటిని వదిలివెళ్లిన కొడుకు ఇన్నాళ్లకు సురక్షితంగా ఇంటికి రావడంతో నంబయ్య తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకును ఆప్యాయంగా చేరదీసిన తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడో తిరిగి , ఆరోగ్యం కుదురుపడి, గతం గుర్తుకు వచ్చి ఇంటి దారి పట్టిన కొడుకును ఆమె అక్కున చేర్చుకుని ఆనందంతో పొంగి పోయింది. తల్లి ని కలుసుకున్న ఆనందంతో నంబయ్య తబ్బి ఉబ్బై పోయాడు. కాగా రెండు దశాబ్దాల అనంతరం ఇంటికి చేరిన నంబయ్యను చూడటానికి బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment