సాక్షి, బెల్లంపల్లి : మండలంలోని నాగారాం గ్రామంలో ఏలాది అనిల్(19) తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలాది వెంకటి– మల్లక్కల మూడో కుమారుడు అనిల్ గ్రామంలో కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆరు నెలలుగా ఇంటి పక్కనే ఉన్న హోంగార్డు మడె తిరుపతి ఇంట్లో నిద్రించేవాడు. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి హమాలీ పనులకు వెళ్తున్నాడు. రెండు రోజులుగా తనకు ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.10వేలు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. వరి పంట అమ్మినడబ్బులు రాగానే కొనిస్తానని తండ్రి నచ్చజెప్పాడు. అయిన సంతృప్తి చెందక మనస్థాపానికి గురై తాను నిద్రించే పక్కింట్లో తాడుతో మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.
పలు అనుమానాలు...
అనిల్ పక్కింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కింట్లో ఎవరు ఉండటం లేదు. మృతిడి చేతిలోని చిట్టీపై ఇద్దరి యువకుల పేర్లు రాసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. యువకుడు వేరే కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment