గుండెలు పిండేసే విషాదం
బెల్లంపల్లి: పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారిన ఓ ప్రభుత్వ పాఠశాల పసిపాప ప్రాణాలు బలిగొంది. ఉపాధ్యాయుడి ఉదాసీన వైఖరి చిన్నారి ఊపిరి తీసింది. సర్కారీ నిష్ఫూచీ సర్పమై చిన్నారిని కాటేసింది. తమ చిట్టితల్లి చదువుల రాణిగా చూడాలని ఆశ పడ్డ ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. గుండెలను పిండేసే విషాదం జరిగిందిలా....
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాముకాటుకు గురై ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గామానికి చెందిన గణేష్, అమృత దంపతుల చిన్న కుమార్తె శ్రీహర్ష (8) స్థానిక చాణక్య విద్యానికేతన్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. రోజులాగే తరగతిగదిలో కూర్చొని పాఠాలు వింటోంది. కిటికీ పక్కన పాము పుట్టతో పాటుగా ముళ్లకంచె ఉంది. ఆమె పెన్సిల్ కిటికీ నుంచి బయటకు పడింది. దీంతో శ్రీహర్ష కిటికీ నుంచి బయటకు చేయి పెట్టి తీసుకుంటుండగా పుట్టలో నుంచి పాము బయటకు వచ్చి కాటు వేసింది.
వెంటనే ఈ విషయం అక్క శ్రీవిద్యకు చెప్పింది. ఆమె ఉపాధ్యాయుడు అర్జయ్యకు దృష్టికి తీసుకువచ్చారు. ముళ్లతో గాయమైందని వారిని దబాయించిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూంలోనే కొంత సమయం వరకు ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్లిన శ్రీహర్షను ఏమైందని తల్లిదండ్రులు అడిగినా ఆమె చెప్పలేక, ముక్కులోంచి నురుగులు కక్కుతూ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత జరిగిన విషయాన్ని చెప్పింది. వారు చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే చనిపోయింది.