సాక్షి, బెల్లంపల్లి : పాతకక్షలు పగబట్టాయో..? మరేం జరిగిందో తెలియదుగానీ.. అభంశుభం తెలియని ఓ పసివాడి ప్రాణం మాత్రం గాలిలో కలిసిపోయింది. కూల్‌డ్రింక్ (మజా)లో విషం కలిపిన విషయం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు ఆనందంగా తాగి అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే.. పసివాడి ప్రాణం పోయింది. మరొకరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
తాళ్లగురిజాల ఎస్సై కిరణ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కపల్లి పంచాయతీ లంబాడితండాకు చెందిన బానోత్ తిరుపతి, రజిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు ఐశ్వర్య (7) బెల్లంపల్లిలోని లోటస్ పాఠశాలలో ఒకటో తరగతి, కుమారుడు శివరాంనాయక్ (4) స్థానిక అంగన్‌వాడీకేంద్రంలో చదువుకుంటున్నాడు. సోమవారం సాయంత్రం తిరుపతి, రజిత పిల్లలతో కలిసి శివారులో ఉన్న పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఐశ్వర్య, శివరాం పొలం గట్లపై ఆడుకుంటున్న సమయంలో వారికి గట్టుపై మాజా కూల్‌డ్రింక్ బాటిల్ కన్పించింది. ఆ బాటిల్ తీసుకుని చిన్నారులిద్దరూ తాగారు. కొద్దిసేపటికి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.
తాము తేని కూల్‌డ్రింక్ గట్టుపై ఎలా ఉందని అనుమానించిన ఆ దంపతులు బాటిల్‌తోపాటు పరిసరాలను పరిశీలించగా.. ఆ ప్రాంతంలో మద్యంసీసాలు కనిపించాయి. కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకుని పరిశీలించగా క్రిమి సంహారక మందు వాసన వచ్చింది. అందులో విషం కలిపినట్లు అనుమానించేలోపే.. ఆ చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని తిరుపతి బైక్‌పై బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు పంపించారు. కరీంనగర్‌కు తరలిస్తుండగా.. శివరాం పరిస్థితి విషమించి.. పెద్దపల్లి శివారులో చనిపోయాడు.
ఐశ్యర్యను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం శివరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను కాపాడుకునేందుకు ఆమె వద్దే ఉన్న ఆ కన్నతల్లి.. తన కుమారుడు శివరాంనాయక్‌ను కడసారి చూసేందుకు వచ్చి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. కొడుక్కు అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆ తల్లిదండ్రులు శోకాతప్త హృదయాలతో కూతురి వద్దకు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment