ఎన్నికల ప్రచారాన్ని కళాకారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తమ ఆటా పాటలతో కార్యకర్తలను ఉర్రూతలూగిస్తున్నారు. ఎక్కడ చూసినా డప్పుల దరువులు, డోలు మోతలు, కాలిగజ్జెల సవ్వడులే వినిపిస్తున్నాయి. తమ ఆటపాటలతో ఆయా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేక ప్రచార వాహనాలపై ఊరూరా తిరుగుతూ ఉర్రూతలూగిస్తున్నారు. సభలకు ముఖ్య అతిథులు చేరుకునేవరకు కార్యకర్తలు, ప్రజలకు విసుగు రాకుండా తమ కళలతో కట్టిపడేస్తున్నారు.
పార్టీల మేనిఫెస్టోలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆకట్టుకునేలా.. ఓటర్లకు చేరేలా పాటల రూపంలో తీసుకెళ్తున్నారు. చివరగా పలానా అభ్యర్థిని గెలిపించాలని ముందుకు సాగుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం కోసం కళాకారుల తలుపు తడుతున్నారు. దీంతో ఒక్కసారిగా వారికి డిమాండ్ పెరిగింది. అయితే ఎన్నికలు వచ్చినప్పుడే తమకు చేతినిండా పని దొరుకుతుందని.. తర్వాత తమను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీర్చే వారికే ఓటు వేస్తామని చెబుతున్నారు.
దుబ్బాకటౌన్: దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కళాకారులు దుమ్ము రేపుతున్నారు. వివిధ పార్టీల తరపును ఆడి పాడుతున్న కళాకారులు ప్రచారన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభ్యర్థి కంటే ముందే సభా వేధికల వద్దకు చేరుకుంటున్న కళాకారులు ప్రచలకు అభ్యర్థి హామీలను, వారి పార్టీ మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తున్నారు.
కడు బీదరికంలో కళాకారులు..
కళను నమ్ముకున్న కళాకారుల కుటుంబాలు ప్రస్తుతం కడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కేవలం ఎన్నికలప్పుడే చేతినిండా పని దొరుకుతుందని అనంతరం తమను పట్టించుకునే వారే ఉండరంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు రెండు నుంచి మూడు వందల వరకు ఇప్పుడు వేయి నుంచి పన్నెండు వందల వరకు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు ఎల్లప్పుడూ ఉపాధి కలిగించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని ఎన్నికల ప్రచారన్ని కళాకారులు తమ ఆటా పాటలతో హోరెత్తిస్తున్నారు. ఎక్కడ చూసినా పలు గ్రామాల్లో కళాకా రుల నృత్యాలు, డోలు వాయిద్యాలు, విన్యాసలే కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి ప్రచారాన్ని కళాకారులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
హుస్నాబాద్‌లో కోలాటం కోలాహలం
హుస్నాబాద్: అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని కళాకారులకు ఉపాధి దొరుకుతోంది. వారి ఆటాపాటలు అభ్యర్థుల ప్రచారానికి అదనపు బలంగా మారాయి. కళాకారులు తమ ఆటా పాటలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గిరిజనుల ఆశీర్వాద సభలో టీవీ యాంకర్ మంగ్లీ తన ఆటా పాటలతో హుషారెక్కించారు.
గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి మంగ్లీ ఆటా పాటకు లయబద్దంగా నృత్యాలు చేశారు. గిరిజన పల్లె బతుకులను గిరిజన భాషలోనే పాడుతూ అందరిని మంత్రముగ్దుల్ని చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామంలో చూసినా కళాకారుల కోలాట నృత్యాలే కనివిందు చేస్తున్నాయి.
జోగిపేట(అందోల్): ఎన్నికలు వచ్చాయంటే చాలు సభలు, సమావేశాలు హోరెత్తుతాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సభలు, సమావేశాల్లో కళాకారులతో ఆకట్టుకునేలా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అతిథులు వచ్చేంత వరకు సభలో కళాకారులు ఆయా పార్టీల కార్యకర్తలను తమ ఆటాపటలతో ఉత్తేజ పరుస్తున్నారు. ప్రజలకు తమ అభ్యర్థులు, వారి పార్టీ విధివిదానాలపై విప్పి చెబుతున్నారు.
ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నిర్వహించిన అలయ్ భలయ్ కార్యక్రమానికి బుల్లితెర కళాకారులు మంగ్లి, మల్లయ్య, కొమురంను ఆహ్వనించారు. వారు ప్రదర్శన, పాటలు కార్యకర్తలను ఉర్రూతలూగించాయి. అదే వేదికపై తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకరుల బృందం పాటలతో కార్యకర్తలను కట్టిపడేసింది. కాంగ్రెస్ పార్టీ కళాకారుల కోసం ప్రత్యేకంగా ప్రచార రథాన్ని తయారు చేయించింది. ఈ రథంపై రాష్ట్ర పీసీసీ సాంస్కృతిక విభాగం చైర్మన్ ఏపూరి సోమన్న కళాబృందం పాటలు పాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే పర్యటించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా సోమన్న గళం విప్పారు.
సిద్దిపేటలో వారిదే సందడి
సిద్దిపేటజోన్: ప్రముఖుల బహిరంగ సభ అయినా.. ఎన్నికల ప్రచార సభ, .. కుల సంఘాల ఆశీర్వద సభలు.. ఆయా పార్టీల ర్యాలీలు ఏవైనా కళాకారుల ఆటాపాటలు అదరాల్సిందే. టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను కళాకారులను తమ ఆట, పాట రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం ఎన్నికల వేళ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కళాకారులతో ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంతో ఎన్నికల సమయంలో కళాకారులకు డిమాండ్ పెరుగుతుంది.
ముఖ్యంగా సిద్దిపేట నియోజవర్గ పరిధిలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆయా గ్రామాల్లో , వార్డుల్లో కళాకారుల ద్వారా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అభ్యర్థి ప్రచార షెడ్యూల్‌లో భాగంగా నిర్ధేశిత ప్రాంతానికి అభ్యర్థుల కంటే ముందుగానే కళాకారులు చేరి తమ ఆట, పాటలతో ప్రజలను గుమికూడేలా చేస్తున్నారు. సంక్షేమ పథకాలను నృత్య రూపంలో ప్రదర్శించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వృద్దులు, మహిళలు, నిరక్షరాస్యులు కళాకారుల ఆట, పాటలకు ఆకర్షితులవుతున్నారు.
చివరగా అభ్యర్థిని ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కళాకారులు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులతో సమానంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల సిద్దిపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి హరిశ్‌రావుకు మద్దతుగా కళాకారుల అశీర్వద ర్యాలీలో వందలాది మంది కళాకారులు విచిత్ర వేషాధారాణతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్పేషల్ అట్రక్షన్‌గా నిలిచారు.
జోరుగా కళా బృందాల ప్రదర్శనలు
శివ్వంపేట(నర్సాపూర్): ఎన్నికల సమయం కావడంతో కళాకారులకు మంచి డిమాండ్ ఏర్పడింది. మండలంలోని పిలుట్ల, అల్లీపూర్ గ్రామాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కళకారులు వివిధ పార్టీలకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, స్వతంత్య్ర అభ్యర్థులకుగానూ ప్రత్యేక వాహనాల ద్వారా ఆయా పార్టీలకు అనుకూలంగా ఆటపాటల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కళాకారుల ఆట, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 8 నుండి 10మంది సభ్యులు గ్రూప్‌గా ఏర్పడి ప్రదర్శనలు చేస్తున్నారు. ఒక్కో కళా బృందానికి రోజుకు రూ.6నుండి 7వేల వరకు చెల్లిస్తున్నారు. దీంతోపాటు భోజన వసతి కల్పిస్తున్నారు.
పాటనే నమ్ముకున్న..
ఎన్నోయేళ్లుగా కళను నమ్ముకొని ముందుకు వెళ్తున్నా... ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. ఎన్నికల సమయంలోనే మాకు ప్రచారం నిమిత్తం రోజుకు రూ.800 నుండి 1000 వరకు లభిస్తుంది. మిగతా రోజుల్లో మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. –రమేష్, టీం లీడర్, అల్లీపూర్
ప్రభుత్వం ఆదుకోవాలె..
టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా గ్రామాల్లో కళా ప్రదర్శన నిర్వహిస్తున్నాం. మమ్ముల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతో ఉన్నాం. ఆట పాటల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఆర్థికంగా వెనకబడిన మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. –శంకర్, టీం లీడర్
ఉపాధి దొరుకుతోంది..
రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టిలకు ప్రచారంలో కళా ప్రదర్శన చేయడంతో నాతో పాటు పది మంది కళాకారులకు జీవనోపాధి దొరుకుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వతకు ప్రభుత్వాలు మా కళాకారులకు ఉపాధి కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం కల్పించే బాధ్యతను మాకు అప్పగించాలి. –రాగుల సారయ్య,
Comments
Please login to add a commentAdd a comment