భద్రాచలం/చింతూరు: మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవా ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీసు స్టేషన్‌ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించే అమరవీరుల వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గత పది రోజులుగా సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలతో పాటు, మండల కేంద్రాల సమీపాల్లో కూడా బ్యానర్‌లు కట్టి, పోస్టర్‌లు వేశారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తమైనట్లు తెలిసింది. చింతూరు, దుమ్ముగూడెం మండలాల సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం, చింతగుప్ప ప్రాంతాల్లో ఇప్పటికే అమరవీరుల స్థూపాలను నిర్మించినట్లు తెలిసింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన శబరి ఏరియా కమిటీ కార్యదర్శి ముప్పు మొగిలి అలియాస్ నరేష్‌కు నివాళిగా స్థూపం నిర్మించేందుకు మావోయిస్టులు ప్రయత్నించగా, పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.
సరిహద్దు గ్రామాల్లో నక్సల్స్ సంచరిస్తూ వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. అమర వీరులకు నివాళులు అర్పించటంతో పాటు ఏదో ఒక సంఘటనకు పాల్పడటం ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. రవాణా వ్యవస్థను విచ్చిన్నం చేసేందుకు వారు వ్యూహం పన్నుతున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే జరిగితే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్న రవాణా వ్యవస్థపై దీని ప్రభావం పడనుంది.
గత అనుభవాల దృష్ట్యా వారోత్సవాల సమయంలో మావోయిస్టులు రైలు పట్టాలను తొలగించే ప్రమాదం ఉండడంతో కేకే లైనుకు సంబంధించి విశాఖపట్నం నుంచి కిరండోల్‌కు వెళ్లే పాసింజర్ రైలుతో పాటు ఐరన్‌వోర్‌ను రవాణా చేసే గూడ్స్ రైళ్లను కూడా జగ్దల్‌పూర్ వరకే పరిమితం చేసే అవకాశముంది. దీంతో పాటు మావోయిస్టుల ప్రభావ ప్రాంతాలైన నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో ప్రైవేటు ఆపరేటర్లు తమ బస్సులను వారం రోజులపాటు నిలిపివేయనున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్, విజయవాడ నుంచి జగ్దల్‌పూర్, బైలాడిల్లా వెళ్లాల్సిన ఆంధ్రా, తెలంగాణా బస్సులను చింతూరు మండల సరిహద్దు కుంట వరకే నడపనున్నట్లు తెలిసింది.
అప్రమత్తమైన పోలీసులు...
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఇటు ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో సైతం కొంతకాలంగా మావోయిస్టులు స్తబ్దుగానే ఉన్నారు. ఈ సమయంలోనే మావోయిస్టులు తమ క్యాడర్‌ను పెంచుకునేందుకు గాను ఛత్తీస్‌గఢ్‌లోని సరిహద్దు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో మరోమారు అలజడి ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే నారాయణ్‌పూర్, కాంకేర్, సుక్‌మా జిల్లాల్లో గత మూడు రోజులుగా సుమారు 15 మంది మావోయిస్టు సభ్యులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బస్తర్ ఐజీ కల్లూరి చింతూరు, భద్రాచలం పోలీసులతో సమావేశమై సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారంపై విస్తృతంగా చర్చించారు. సరిహద్దుల్లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించినట్లు సమాచారం.
టార్గెట్ నాయకులకు హెచ్చరికలు...
వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న నాయకులెవరూ ముందస్తు సమాచారం లేకుండా గ్రామాలకు వెళ్లరాదని పోలీసులు ెహ చ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే వారికి నోటీసులు జారీచేశారు. కాగా, ఈ పరిణామాలు సరిహద్దు గ్రామాల్లో ఉన్న గిరిజనులపై ప్రభావం చూపుతున్నాయి. కొరియర్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు గిరిజన గ్రామాల్లో పర్యటించి, అనుమానితులను పోలీస్ స్టేషన్‌లకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. మరో పక్క పోలీస్ ఇన్‌ఫార్మర్‌లుగా వ్యవహరించవద్దని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల నడుమ అమాయక గిరిజనులు నలిగిపోతున్నారు. వారోత్సవాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
హై అలర్ట్..!
Published Mon, Jul 28 2014 2:27 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement