మావోయిస్టు విప్లవ సాహిత్యం పుస్తకాలు లభ్యం
► మొక్కల ప్లాంటేషన్ పనుల్లో
► బయటపడ్డ స్టీల్ పెట్టెలు ఒక్కసారిగా ఉలికిపాటు
జైపూర్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ముదిగంట గ్రామ పంచాయతీ పరిధిలో గల కాన్కూర్ శివారులోని అటవీప్రాంతంలో మావోయిస్టుల విప్లవసాహిత్య పుస్లకాలు లభించాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ అధికారులు కాన్కూర్ అటవీప్రాంతంలో మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపెద్ద చెట్లను తొలగించడానికి జేసీబీతో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం స్టీల్ పెట్టెలు (రెండు పెద్ద టిఫిన్‌బాక్సులు) బయటపడ్డాయి.
ప్లాంటేషన్ పనులు చేస్తున్న ఫారెస్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించగా శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై సంజీవ్ అక్కడి చేరుకుని వాటిని పరిశీలించారు. రెండు స్టీల్ బాక్సుల్లో విప్లవసాహిత్యం పుస్తకాలు లభ్యమైనట్లు వారు తెలిపారు. స్టీల్‌బాక్సుల్లో లభ్యమైన విప్లవసాహిత్యం పుస్తకాలను స్వాధీనం చేసుకుని.. అదే ప్రవేశంలో తనిఖీ చేశారు. వాటిని పదిహేనేళ్ల క్రితం దాచివుంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మావోయిస్టుల విప్లవసాహిత్యం పుస్తకాలు లభించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులను కలవరపర్చుతోంది.