మావోయిస్టుల లొంగుబాటు పర్వం ... | maoists are surrendered in district | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల లొంగుబాటు పర్వం ...

Published Sat, Sep 27 2014 12:23 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

maoists are surrendered in district

ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. రెండు వారాల క్రితమే మావోయిస్టు దంపతులు లొంగిపోగా.. శుక్రవారం మరో ఇద్దరు మావోయిస్టు దంపతులు ఆడే ప్రభు, తలాండి కాంత ఎస్పీ గజరావు భూపాల్ ఎదుట లొంగిపోయారు. ఒకవైపు మావోలకు, పోలీసులకు ఎన్‌కౌంటర్లు జరుగుతుండగా.. మరోవైపు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం మావోయిస్టుల ఉనికిని దెబ్బతీస్తోంది. శుక్రవారం లొంగిపోయిన మావోయిస్టు దంపతుల వివరాలు ఎస్పీ భూపాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
 
ఆడే ప్రభు ఊరఫ్ చంద్రం, సతీష్. స్వస్థలం నేరడిగొండ మండలం కుంటాల గ్రామం. 1984లో అప్పటి ఖానాపూర్ దళ కమాండర్ రమేశ్ నిర్వహించిన గ్రామసభల్లో విప్లవ గీతాలకు ఆకర్షితుడై దళంలో చేరాడు. అప్పటి నుంచి ఐదు నెలలు సభ్యునిగా కొనసాగిన అనంతరం మంగి దళకమాండర్ జగదీశ్ ఆధ్వర్యంలో 1986 వరకు సభ్యునిగా కొనసాగాడు. తర్వాత బదిలీపై మహారాష్ర్టలోని గడ్చిరోలి జిల్లా బాంగ్రామాడ్ ఏరియాలో సభ్యునిగా 12 బోర్ ఆయుధం ధరించి 1990 వరకు పనిచేశాడు. 1991లో డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతిపై గడ్చిరోలి జిల్లా మాడ్ డివిజన్‌కు బదిలీపై వెళ్లాడు.
 
అక్కడే పనిచేస్తున్న దళ సభ్యురాలు తలాండ కవితను 1992లో వివాహం చేసుకున్నాడు. 1994 వరకు పనిచేసిన అనంతరం వీరిరువురు బదిలీపై గోందీయా డివిజన్ ఉత్తర గడ్చిరోలీలో 1996 వరకు తాండదళంలో ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగాడు. 2003 కమాండర్‌గా పదోన్నతి పొంది కోబ్రామడ్‌గా 2008 వరకు పనిచేశాడు. 2014లో కమాండర్ హోదాలో బదిలీపై ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డివిజన్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఈయన స్థాయి తగ్గించి ఇంద్రావతి ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల వయసులోనే మావోయిస్టు దళంలో చేరిన ఈయన దాదాపు 30 ఏళ్లపాటు కొనసాగాడు.
 
తలాండి కాంత ఊరఫ్ సుజాత. స్వస్థలం మహారాష్ట్రలోని ఆహెరి తాలుక దేశీల్‌పేట్ గ్రామం. మావోయిస్టు పార్టీలో డీసీఎంగా పనిచేస్తున్న ఆమె బంధువు సెడ్మేక రాధక్క ప్రోద్భలంతో 1991లో ఆహెరి దళంలో సభ్యురాలిగా చేరింది. 1992లో నుంచి 1994 వరకు బాంమ్రాగడ్ దళంలో.. 1994 నుంచి 2001 వరకు తాండ దళంలో పనిచేసింది. 2002 నుంచి 2004 వరకు దేవురిదళంలో ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేశారు. దేవురి దళంలో పదోన్నతి లభించి 2004 నుంచి 2008 వరకు దళ కమాండర్‌గా కొనసాగారు. 2009లో ఇంద్రావతి దళ కమాండర్‌గా బదిలీ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దళ కమాండర్‌గానే కొనసాగింది.
 
జిల్లా సరిహద్దులో పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగుతుండడంతో ఇటీవల జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టులకు తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన మా వోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన పునరావాస సహాయం అందిస్తామని, లొంగిపోయిన వారికి రివార్డులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement