- 14 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల బలి
- ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుని కాల్పులు
సాక్షి, ఖమ్మం, చింతూరు/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మళ్లీ పంజా విసిరారు. సాధారణ ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుని సీఆర్‌పీఎఫ్ బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 14 మంది జవాన్లను బలి తీసుకున్నారు. దాడిలో మరో 15 మంది జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ అధికారులు ఉన్నారు. ఈ దారుణం సోమవారం సుక్మా జిల్లాలోని దట్టమైన చింతగుహ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఛత్తీస్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
పది రోజుల కిందట ఇదే ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడి చేసిన మావోయిస్టులు మంగళవారం నుంచి పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలకు పిలుపునివ్వడంతో వారు హింసకు పాల్పడొచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు రెండు వారాలుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సోమవారం చింతగుహ అడవుల్లో ఆపరేషన్ ముగించుకుని వస్తున్న సీఆర్‌పీఎఫ్ 233, 206 బెటాలియన్లు, వాటి కోబ్రా విభాగాలకు చెందిన 250 మంది జవాన్లపై నక్సల్ కలశ్‌పాడ్ ప్రాంతంలో ఉదయం 10.30 గంటలకు మెరుపుదాడి చేశారు.
అడవిలోని గిరిజనులను, ఇతర స్థానికులను అడ్డుపెట్టుకుని నలువైపుల నుంచి ఒక్కసారిగా భారీఎత్తున కాల్పులు జరిపారు. తామూ కాల్పులు జరిపితే ప్రజలు చనిపోతారని భావించిన జవాన్లు సంయమనం పాటించి దాడిని బలంగా తిప్పికొట్టలేకపోయా రు. నక్సల్స్ దాడిలో సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండంట్ బీఎస్ వర్మ, అసిస్టెంట్ కమాండంట్ రాజేశ్ సహా ఆ విభాగానికి చెందిన 14 మంది మృతిచెందారు. ఇరుపక్షాల మధ్య రెండున్నర గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జవాన్ల మృతదేహాలను, క్షతగాత్రులను మంగళవారం హెలికాప్టర్‌లో జగదల్‌పూర్ ఆస్పత్రికి తరలించనున్నారు. గత నెల 21న చింతగుహ అడవుల్లో నక్సల్స్ జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు గాయపడ్డం తెలిసిందే.
పాశవికం, అమానుషం: మోదీ
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ నక్సల్ జరిపిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘జాతి వ్యతిరేక శక్తలు చేసిన ఈ పాశవిక, అమానుష దాడిని గర్హించడానికి మాటలు చాలవు. ఈ రోజు అమరులైన సీఆర్‌పీఎఫ్ ధీరులకు సెల్యూట్ చేస్తున్నా. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్‌లతో మాట్లాడానని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. దాడి పిరికిపంద, హింసాత్మక చర్య అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, పరిస్థితిని సమీక్షించాలని కోరారు. పరిస్థితి సమీక్షించడానికి రాజ్‌నాథ్ మంగళవారం ఛత్తీస్‌కు రానున్నారు. నక్సల్స్ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దుర్ఘటనకు కారణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
పథకం ప్రకారం దాడి: మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమిషన్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలు పక్కా పథకం ప్రకారం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టు సెంట్రల్ రీజినల్ కమాండ్ బృందాలు నెలరోజులుగా దర్బాఘాట్ నుంచి సుక్మా జిల్లాతో పాటు ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల వరకు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. దాడిలో సుమారు 200 మంది నక్సల్స్, మిలీషియా సభ్యులు పాల్గొన్నట్లు తెలిసింది. ఛత్తీస్‌లో నక్సల్స్ అణచివేతకు రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించడం, వారిని ఏరేసే రోజు ఎంతో దూరంలో లేదని సీఎం రమణ్‌సింగ్ ఆదివారం చెప్పిన నే పథ్యంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తమకు పట్టున్న ప్రాంతంలో పాగా వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో నక్సల్స్ ఈ దారుణానికి తెగబడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు: నక్సల్స్ పీఎల్‌జీఏ వారోత్సవాలు, ఛత్తీస్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం - ఛత్తీస్ సరిహద్దులో గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఉధృతం చేసి అడవులను జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి అదనపు బలగాలను తరలించారు. ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ప్రాంతాల్లోపై నిఘా పటిష్టం చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మంత్రులు, వీఐపీలు మారుమూల ప్రాంతాలకు వెళ్లొద్దని నిఘా అధికారులు సూచించారు. వీఐపీలు ఇప్పటి కే మారుమూల ప్రాంతాల్లో ఉంటే వారిని వెంటనే హైదరాబాద్‌కు రావాలని సమాచారమిచ్చినట్లు తెలిసింది.పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై తెలంగాణ రీజియన్ ఐజీ వి.నవీన్‌చంద్.. కరీంనగర్, వరంగల్ రేంజ్ డీఐజీతోపాటు సంబంధిత జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు.