
కల్వకుర్తి: మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని తాండ్ర, పోతేపల్లి, బైరాపూర్ గ్రామాల్లో మావోయిస్టుల పేర్లతో పోస్టర్లు వెలిశాయి. ఏకంగా సీఎం కేసీఆర్‌కు హెచ్చరిక చేస్తూ ‘ఖబడ్డార్ సీఎం కేసీఆర్.. ఉరికొయ్యలు, చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు..’అని సీపీఐ మావోయిస్టు పేర ఎర్ర సిరాతో వాల్‌పోస్టర్లు వేశారు. తాండ్ర స్టేజీ వద్ద, వెల్దండ మండలంలోని పోతేపల్లి, బొల్లంపల్లిలో ఒకటి చొప్పున అంటించారు.
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పోస్టర్లు వెలియడంతో నక్సల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయా.. అనే అనుమానం వ్యక్తమవుతుంది. చాపకిందనీరులా మళ్లీ మావోయిస్టులు పార్టీని విస్తృత పరిచి యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే పోస్టర్లు వేశారని భావిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీïసీ ఎన్నికల సమయంలో ఈ పోస్టర్లు వేయడంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా.. గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్న ప్రజల్లో ఆందోళన నెలకొంది.
మావోల చెర నుంచి గిరిజనుల విడుదల
చర్ల: భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలకు చెందిన ముగ్గురు గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేశారు. ఈనెల 2న మండలంలోని బోదనెల్లికి చెందిన కుంజా బుచ్చిబాబు అనే యువకుడితో పాటు చింతగుప్పకు చెందిన మరో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. వారికి ఏ హానీ తలపెట్టకుండా విడుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి వారిని విడుదల చేసినట్లు తెలిసింది. అయితే, విడుదలకు సంబంధించి కుటుంబసభ్యులు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు.
వాహనాల దహనం..
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రోడ్డు పనులకు వినియోగిస్తున్న ఐదు వాహనాలను మావోయిస్టులు ఆదివారం దహనం చేశారు. సుకుమా జిల్లా గొల్లపల్లి నుంచి వంజలవాయి మీదుగా కుంట వరకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులతో రోడ్డు పనులు చేస్తుండగా, వాటిని నిలిపివేయాలంటూ మావోయిస్టులు కాంట్రాక్టర్‌ను, గుమస్తాలను హెచ్చరించినట్లు తెలిసింది.
అయితే, వారు ఆ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా పనులు కొనసాగిస్తుండడంతో ఆదివారం పనులు చేస్తున్న ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు డ్రైవర్లను చితకబాదారు. అనంతరం వారిని దూరంగా తీసుకెళ్లి వాహనాల ట్యాం కుల్లోని డీజిల్‌ను పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు జేసీబీలు, రెండు పొక్లెయినర్లు, ఒక ట్రక్కు దగ్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment