సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం రీడిజైన్‌ను నిపుణుల కమిటీ తిరస్కరించిందని, రీడిజైన్ వల్లనే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్‌సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర నిపుణుల కమిటీకి సరైన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్ల గురించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఉందని, మల్లన్నసాగర్ రిజర్వాయర్ గురించి కమిటీకి చెప్పలేదన్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయరు సామర్థ్యం పెంపు, ఇతర రీడిజైన్ల వల్లనే కేంద్ర జలవనరుల సంఘం నుంచి మరోసారి అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందని శశిధర్‌రెడ్డి వివరించారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి, కమీషన్లు తీసుకోవాలనుకునే టీఆర్‌ఎస్ నేతల దురాశవల్లనే జాప్యం జరుగుతున్నదని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.