హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కావాలని కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లో మర్రి శశిధర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లేకపోతే రాష్ట్రానికి ఆర్థిక భారం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎత్తిపోతల పథకంలో భాగంగా స్టోరేజ్ రిజర్వాయర్లను నిర్మించలేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ అనవసరమని మర్రి శశిధర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సవాల్ విసిరినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదన్నారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కావాలన్న కేసీఆర్ ఇప్పడు రీడిజైన్తో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్కు కేంద్రం జాతీయ హోదా ఇవ్వదనే అడగటం లేదన్నారు
సాంకేతికంగా ఆమోదయోగ్యం కాని డిజైన్లతో కాళేశ్వరం చేపడుతున్నారని ఆరోపించారు. కాబట్టే జాతీయ హోదా రాదని తెలిసి అడగటం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లను సంతృప్తి పరిచేందుకు, అవినీతి కోసమే... ఇష్టానుసార డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతిని జరగనివ్వకుండా... అడ్డుకుంటామని మర్రి శశిధర్రెడ్డి స్పష్టం చేశారు.