
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్‌ను అవాక్కయ్యేలా చేశారు.
వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం.
21 ఏళ్ల లోపు వారికి వైన్స్‌లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment