రైతుల బాధను అర్థం చేసుకోండి | Medak Collector Dharma Reddy Fires On Revenue Department | Sakshi
Sakshi News home page

రైతుల బాధను అర్థం చేసుకోండి

Published Thu, Apr 18 2019 11:17 AM | Last Updated on Thu, Apr 18 2019 11:17 AM

Medak Collector Dharma Reddy Fires On Revenue Department - Sakshi

విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి 

మెదక్‌ రూరల్‌ : ప్రతీ రెవెన్యూ అధికారి రైతుల స్థానంలో ఉండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను తరచూ కార్యాలయాల చుట్టూ అధికారులు తిప్పుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఎంతో మంది రైతుల భూములను ఇతరుల పేర్ల మీదికి మారుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారుల పేర్ల మీద ఉన్న భూములను సైతం ఇతరుల పేర్ల మీదికి రాస్తే ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. రికార్డులపై అధికారులకు కనీస అవగాహన లేదన్నారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే అధికారుల కనీస బాధ్యత అనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారన్నారు. ప్రతీ అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో వీఆర్వోలపై తహసీల్దార్ల పర్యవేక్షణ కొరవడిందన్నారు. వీఆర్వోల పనితీరును ఎప్పటికప్పుడు తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రెండేళ్ల నుండి పౌతి కేసులు సైతం పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 

అంతకుముందు జాయింట్‌ కలెక్టర్‌ నగేష్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల పనితీరు జిల్లాలో సంతృప్తికరంగా లేదని, అధికారులు తమ పని తీరును మార్చుకొని ప్రజలకు నిస్వార్థమైన సేవలను అందించాలన్నారు. జిల్లాలో ఉన్న వీఆర్వోల్లో కొద్ది మంది మాత్రమే విజయవంతమయ్యారని తెలిపారు. ప్రతీ సమస్యను చిత్తశుద్ధితో అధ్యయనం చేసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. రైతుల భూములకు సంబంధించిన ప్రొసీడింగ్‌పై తహసీల్దార్లు సంతకం చేసేటప్పుడు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీ మండలంలో ఉన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన జాయింట్‌ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినా కొన్ని మండలాల్లో ఇంకా పూర్తి చేయలేదని, వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సాయిరాం, అరుణారెడ్డి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ గంగయ్యతోపాటు తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీర్వోలు, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సీడ్‌ హబ్‌గా మారనున్న రాష్ట్రం
కౌడిపల్లి(నర్సాపూర్‌): మన రాష్ట్రం త్వరలో సీడ్‌ హబ్‌గా మారనుందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సాగులో మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి వద్ద ఉన్న డాక్టర్‌ డి రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ వ్యవసాయ కళాశాల 15వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఏడీఏ పరశురాంనాయక్, విజ్ఞానజ్యోతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అర్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్రం సీడ్‌ హబ్‌గా మారుతుందన్నారు. ఇజ్రాయిల్‌ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలు చేస్తోందన్నారు. మన దేశంలో అన్ని రకాల నేలలు, వాతావరణం ఉన్నాయని తెలిపారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారంగా మారిందన్నారు. ఐటీఐ, పాల్‌టెక్నిక్‌ కన్నా వ్యవసాయ విద్యలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో రాణించాలని అన్నారు. 

జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి : డీఏఓ పరశురాంనాయక్‌
జిల్లాతోపాటు రాష్ట్రంలో వ్యవసాయానికి మంచి రోజులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వం ఉద్యోగం కంటే వ్యవసాయంలో మంచిగా రాణించాలని డీఏఓ పరశురాంనాయక్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఇక్కడ చదివిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్‌ జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులు సాగు చేసిన పంటలకు వచ్చిన లాభాలను ఒక్కో విద్యార్థికి రూ. 635 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి ప్రతినిధులు డీఎన్‌రావు, రాజశేఖర్, అచ్యుతరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement