
మెదక్‌జోన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు రోగులసంఖ్యకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఒకప్పుడు సర్కార్ దవాఖానా అంటేనే భయపడే వారు ప్రస్తుతం బారులు తీరి చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. బయటనుంచి వచ్చే రోగులకు (ఓపీ) చికిత్స అందించే సమయం ప్రస్తుతం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగుతోంది. ఈ లెక్కన రోజుకు 3గంటలు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్న క్రమంలో జిల్లా నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారు.
ఆస్పత్రికి వచ్చిన వారికి చికిత్స అందకుండానే సమయం దాటిపోతుండడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బయటనుంచి వచ్చే రోగులకు చికిత్సలు అందజేసేలా సమయాన్ని పొడిగించినట్లు తెలిసింది. ఇకపై నిత్యం 5గంటలపాటు వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సైతం ఈ సమయం మారనుంది. డయాగ్నస్టిక్ (ల్యాబ్) సేవల సమయాన్ని సైతం అదనంగా రెండు గంటలు పెంచనున్నారు.
ఆదేశాలు రాగానే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే ఓపీ సమయం అదనంగా రెండు గంటలు పెంపు విషయం ఇంకా అధికారికంగా అందలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆదేశాలు రాలేదని భావిస్తున్నాం. ఆదేశాలు రాగానే ఉదయం సమయాన్ని అమలు చేస్తాం. – వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment