సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీబీనగర్ ఎయిమ్స్‌లో వచ్చే డిసెంబర్ నుంచి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్కడ నిమ్స్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతుండగా, త్వరలో ఎయిమ్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభ గల ప్రముఖవైద్యులు, ప్రొఫెసర్లు అక్కడ అందుబాటులో ఉంటారు. వారి సేవలు బీబీనగర్ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అం దనున్నాయి. ఇప్పటికే నిమ్స్ ద్వారా రోజుకు 500 మంది వరకు ఓపీ రోగులు వస్తున్నా రని అంచనా. ఎయిమ్స్ సేవలు అందుబాటులోకి వస్తే రోజుకు 2వేల మంది వరకు వచ్చే అవకాశముందంటున్నారు. ఈ ఏడాది నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమ య్యాయి. పలు రాష్ట్రాలకు చెందిన 50మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
మార్చి నుంచి ఇన్ పేషెంట్ సేవలు...
వచ్చే మార్చి నుంచి ఇన్‌పేషెంట్(ఐపీ) సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా జనరల్ మెడిసిన్, గైనిక్ విభాగాల్లో ఇన్ పేషెంట్లకు ముందుగా వైద్య సేవలు ప్రారంభించి తదుపరి విడతల వారీగా ఇతర వైద్య సేవలన్నింటినీ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎయిమ్స్ వర్గాలు ముందుగా 750 పడకలతో అనుబంధ ఆస్పత్రి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకొని వెయ్యి పడకలకు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కేంద్ర ఎయిమ్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశాయి. అందుకు కేంద్ర వర్గాలు సుముఖత వ్యక్తంచేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలకాధికారి ఒకరు తెలిపారు. ఇన్‌పేషెంట్లు 2 వేల వరకు రోజూ ఉంటే, పడకల సంఖ్య తప్పనిసరిగా వెయ్యి ఉండాలని అంటున్నారు. నిమ్స్‌లో ప్రస్తుతమున్న ఫీజుల మాదిరిగానే ఎయిమ్స్‌లో ఉంటాయని అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.
మూడేళ్లలో నిర్మాణం పూర్తి..
బీబీనగర్ ఎయిమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 200 ఎకరాలు కేటాయించింది. అధికారులు పలుమార్లు దీనిపై ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్ కోసం కృషిచేశారు.ఎట్టకేలకు ఇది సాకారం కావడంతో ఇక్కడి ప్రజలు సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ నిమ్స్ భవనాలు ఉండటంతో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తున్నారు. మూడేళ్లలోగా పూర్తిస్థాయిలో 200 ఎకరాల్లో హాస్టళ్లు, ప్రొఫెసర్లు, డాక్టర్ల వసతి గృహాలు పూర్తికానున్నాయి.అద్భుతమైన మైదానాలు, స్విమ్మింగ్ ఫూల్స్, బృందావనాలు కూడా రూపుదిద్దుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అందుకోసం ఎయిమ్స్ ఇప్పటికే నిధులు కేటాయించింది. మున్ముందు పీజీ సీట్లు కూడా వచ్చాక ఎయిమ్స్ ద్వారా ఇక్కడి ప్రాంత వాసులకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు మించి వైద్యం ఉంటుందని, అదే రాష్ట్రంలో వైద్యానికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని అంటున్నారు. అంతేగాక అనేక పరిశోధనలు కూడా ఇక్కడ జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment