సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కు ముఖద్వారం
సాక్షి, హైదరాబాద్: మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన శరవేగంగా సాగుతోంది. వైద్య ఉపకరణాల తయారీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలకు భూకేటాయింపులు కూడా జరిగాయి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. పార్కు నిర్మాణానికి వీలుగా సుల్తాన్‌పూర్ పరిధిలోని 174, 70 సర్వే నంబర్ల పరిధిలో 557.32 ఎకరాలను కేటాయించింది. ఔటర్‌రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను టీఎస్‌ఐఐసీ చేపట్టింది. 2017 జూన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్కును రెండు దశల్లో ఏ, బీ బ్లాకులుగా అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి పార్కు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు పార్కులో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.35 కోట్ల మేర ఖర్చు చేసింది. రూ.20 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
కొండలను పిండి చేసి..
పార్కు ఆవరణలో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తుండటంతో 272 ఎకరాల్లో మెడికల్ డివైజెస్, 226 ఎకరాల్లో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేలా డీపీఆర్‌లో అధికారులు మార్పులు చేశారు. మరో 47 ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’కు కేటాయించారు. వంద, 60 అడుగుల వెడల్పుతో 5.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, హై టెన్షన్ విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ట్రాన్స్‌కో విభాగం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. నీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయిం చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఐఐసీ ప్రతి పాదనలు సమర్పించింది. పార్కుకు కేటాయించిన ప్రాంతంలో 150 ఎకరాలు మాత్రమే చదునుగా ఉండగా, మిగతా భూమి కొండలు, గుట్టలతో నిండి ఉంది. దీంతో కొండలను పిండి చేయాల్సి రావ డంతో ఖర్చు కూడా పెరుగుతున్నట్లు టీఎస్‌ఐఐసీ వర్గాలు వెల్లడించాయి.
రెండంకెల వృద్ధి రేటు లక్ష్యంగా...
దేశంలో వైద్య ఉపకరణాల తయారీ రంగం శైశవదశలో ఉన్న నేపథ్యంలో బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. దేశంలో మూడు బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు జరుగుతుండగా రెండంకెల వృద్ధి రేటుతో 2023 నాటికి 11 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో స్థానికంగా వైద్య ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2015–2020’లో భాగంగా మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇప్పటివరకు మెడికల్ డివైజెస్ పార్కులో 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా రూ.3,631.97 కోట్ల పెట్టుబడులతోపాటు 1,588 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2019 చివరిలోగా భూ కేటాయింపు పొందిన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించే భఃవిధంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి.
క్రషర్ల తొలగింపునకు నోటీసులు
మెడికల్ డివైజెస్ పార్కుకు కేటాయించిన సర్వే నంబరు 174లో గతంలో నాలుగు మైనింగ్ కంపెనీలకు క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం పార్కులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నా, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఖాళీ చేసేందుకు క్రషర్ల యజమానులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రెండు యూనిట్లను మూసివేయించిన టీఎస్‌ఐఐసీ.. మరో రెండు యూనిట్ల మూసివేతకు కూడా నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment