‘క్లినికల్‌’ కిల్లింగ్స్‌! | Medical experiments killing poors | Sakshi
Sakshi News home page

‘క్లినికల్‌’ కిల్లింగ్స్‌!

Published Sun, Dec 3 2017 1:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Medical experiments killing poors - Sakshi

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన యువకుడి పేరు సురేశ్‌.. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.. ఈ పేదరికాన్ని ఆసరాగా తీసుకున్న ఓ ఔషధ కంపెనీ ఏజెంటు వల విసిరాడు.. ఔషధ ప్రయోగానికి అంగీకరిస్తే డబ్బులు వస్తాయని ప్రలోభపెట్టాడు.. దీంతో సురేశ్‌ బెంగళూరులోని అపోటెక్స్‌ కంపెనీలో ఓ మత్తు మందు ప్రయోగంలో పాల్గొన్నాడు. రెండు నెలలుగా సురేశ్‌ ఆరోగ్యం క్షీణించింది. యుక్త వయసులోనే ఒంటి నొప్పులు, నిద్రలేమితో సతమతమయ్యాడు. శనివారం బైక్‌పై వెళుతుండగా కళ్లుతిరిగి కిందపడి.. రక్తం కక్కుకుంటూ యాతనపడ్డాడు.

సాక్షి, హైదరాబాద్, జమ్మికుంట రూరల్‌ (హుజూరాబాద్‌) : ఒక్క సురేశ్‌ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వ్యక్తులు ఔషధ ప్రయోగాల (క్లినికల్‌ ట్రయల్స్‌) ఎరకు చిక్కిశల్యమవుతున్నారు. కొందరైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఔషధ కంపెనీలు డబ్బు ఎరచూపుతూ పేద బతుకులతో చెలగాటమాడుతున్నాయి. ఔషధ ప్రయోగాల్లో పాల్గొని ఇదే జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన వంగర నాగరాజు (39) జూన్‌లో మృతి చెందగా.. ఇదే మండలం కొత్తపల్లికి చెందిన చిలువేరి అశోక్‌కుమార్‌ మతిస్థిమితం కోల్పోయాడు. అటు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన గోరెపు చౌదరి (38) అనే వ్యక్తి కూడా ఔషధ ప్రయోగాలు వికటించి మరణించాడు.

విచ్చలవిడిగా ప్రయోగాలు..
రాష్ట్రంలో ఔషధ ప్రయోగాలు (క్లినికల్‌ ట్రయల్స్‌) విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఔషధ ప్రయోగ సంస్థలు నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. పేదలపై ఔషధాలను ప్రయోగిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే, ఆయా ఔషధాలు వారికి సరిపడతాయా, లేదా అన్నది కచ్చితంగా పరిశీలించకుండానే, అసలు ఆయా ఔషధాలతో ఉండే దీర్ఘాకాలిక దుష్ఫలితాలను బాధితులకు చెప్పకుండానే.. ఈ ప్రయోగాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ లేమితో ఈ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పేదల బతుకులు మాత్రం ఛిద్రమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఔషధ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నా... ఎక్కడైనా బాధితులు మరణించిన సందర్భాల్లోనే ఈ వ్యవహారం బయటికి వస్తోంది. నాలుగు నెలల కింద కరీంనగర్‌ జిల్లాలో వందల మంది బాధితులు ఔషధ ప్రయోగాలపై ఫిర్యాదులు చేశారు. అయినా ఏమాత్రం చర్యలు లేకపోవడం ఆందోళనకరం.

ఎంతో కొంత సొమ్ము ఇచ్చి..
ఫార్మా కంపెనీలు తాము అభివృద్ధి చేసే ఔషధాలను తొలుత జంతువులపై ప్రయోగిస్తాయి. అనంతరం మనుషులపై ప్రయోగించేందుకు అనుమతి తీసుకుంటాయి. ఇలా మనుషులపై ప్రయోగించి, ఫలితాలను పరిశీలించే పనిని ఔషధ ప్రయోగ కేంద్రాలకు కాంట్రాక్టు కింద అప్పగిస్తాయి. ఈ కేంద్రాలు.. ఔషధాలను బట్టి వ్యక్తులను ఎంపిక చేసుకుని ప్రయోగిస్తాయి, ఫలితాలను క్రోడీకరించి ఫార్మా కంపెనీలకు అందిస్తాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ ప్రయోగ కేంద్రాలు వాటిని పట్టించుకోవడం లేదు. ఎంతో కొంత సొమ్ము ఇచ్చి, ఔషధ ప్రయోగాలకు పేదలను ఒప్పిస్తున్నాయి. ఏ అంశానికి సంబంధించిన ఔషధం, ఎందుకోసం ప్రయోగిస్తున్నారు, దుష్ఫలితాలు ఎలా ఉంటాయి.. వంటి అంశాలేమీ వివరించకుండా వారి జీవితాలను బలి తీసుకుంటున్నాయి.
 
నిబంధనలు బేఖాతరు

దేశవ్యాప్తంగా 96 వేల ఔషధ కంపెనీలు ఉండగా.. అవి తయారు చేసే ఔషధాలను ప్రయోగించి చూసేందుకు 84 ప్రయోగ కేంద్రాలున్నాయి. ఇందులో మహారాష్ట్రలో 24, గుజరాత్‌లో 18, తెలంగాణలో తొమ్మిది ప్రయోగ కేంద్రాలకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. మిగతా ప్రయోగ కేంద్రాలు పలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ ప్రయోగ కేంద్రాలన్నీ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (డీసీవో) నిబంధనలను పాటించాలి. ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు... తొలిదశలో ఆ ఔషధం పరిమాణం, తీవ్రత, సాంద్రత తదితర అంశాలపై ప్రయోగాలు చేస్తారు. ఇలా ప్రాథమికంగా సిద్ధం చేసిన ఔషధాన్ని రెండోదశలో ప్రయోగశాలలో జంతువుల (ముఖ్యంగా ఎలుకలు, గిన్నీ పిగ్స్‌)పై ప్రయోగిస్తారు. ఇందులో సంతృప్తికర ఫలితాలు వస్తే.. మూడో దశలో మనుషులపై ప్రయోగిస్తారు. ఇలా మనుషులపై చేసే ప్రయోగంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అత్యంత ప్రమాదకరమైన ఔషధాలు.. ఇవి కేన్సర్, గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధుల నియంత్రణ, నివారణ కోసం తయారు చేసేవి. ఇక రెండో రకం సాధారణంగా ఇతర దుష్ఫలితాలు ఉండే ఔషధాలు.. ఇవి ఇతర సాధారణ అనారోగ్యాల నియంత్రణ, నివారణ కోసం రూపొందించేవి. వీటిలో ప్రమాదకర ఔషధాల ప్రయోగంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ప్రయోగ కేంద్రాలు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒకే వ్యక్తిపై పలు రకాల ఔషధాలను ప్రయోగిస్తున్నాయి. కొన్నిసార్లు సాధారణ ఔషధాలుగానే చెప్పి, ప్రాణాంతక ఔషధాలను ప్రయోగిస్తున్నాయి. దీంతో బాధితుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రాణహాని కూడా ఉంటోంది.
 
వివరాలు ఉండవు.. బాధితులకు చెప్పరు!
ఔషధ ప్రయోగానికి సిద్ధమయ్యేవారు 23–24 పేజీల అంగీకారపత్రంపై సంతకం చేయాలి. అందులో ఎన్నో లిటిగేషన్లు ఉంటాయి. ఆ ప్రయోగ ప్రక్రియకు ఇష్టపూర్వకంగా ఒప్పుకొంటున్నానని.. ఒకవేళ మరణం సంభవించినా అది తమ బాధ్యతేనని అంగీకరించినట్లుగా ఆ పత్రాల్లో ఉంటుంది. పేదలు, అవసరాల కోసం డబ్బులు కావాల్సిన వ్యక్తులు... ఏజెంట్ల వలలో పడి ఔషధ ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. కంపెనీలు ఈ ఔషధాల వల్ల సంభవించే పరిణామాలు, దుష్ఫలితాల గురించి వారికి పూర్తిగా వివరించడం లేదు. పత్రాల్లో సంతకాలు చేసేటప్పుడు నిబంధనలను చదువుకునే పరిస్థితి, అవకాశం కూడా బాధితులకు ఉండడం లేదు. చాలా మంది కుటుంబ సభ్యులెవరికీ చెప్పకుండానే సంతకాలు చేసేస్తున్నారు. కానీ వారికేమైనా అయితే తర్వాత కుటుంబం మొత్తం వీధినపడాల్సిన దుస్థితి ఉంటోంది. ఇక ఔషధ ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తుల వివరాలను ఆయా సంస్థలు ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉన్నా.. ఆ పని చేయడం లేదు. బాధితులకు ఏం జరుగుతోందన్న విషయం బయటికి రావడం లేదు.
 
బ్లడ్‌బ్యాంకుల నుంచి..
ప్రధానంగా బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకుల సహకారంతో ఔషధ ప్రయోగాలకు వ్యక్తుల ఎంపిక, తరలింపు జరుగుతోంది. తరచూ రక్తదానం చేసిన వారిని గుర్తించి.. ఔషధ ప్రయోగాల కోసం ఎంచుకున్నట్లుగా వైద్యశాఖ అధికారుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. రక్తదానం కోసం వచ్చే వ్యక్తులతో మాట్లాడి.. ఔషధ ప్రయోగశాల కోసం తీసుకెళుతున్నారు. వ్యక్తుల ఎంపిక, ఎవరిని ఏ ప్రయోగశాలకు పంపాలనే సమాచారం, వారి ప్రయాణం అంతా వాట్సాప్‌ గ్రూపుల్లోనే జరుగుతోంది. అయితే ప్రయోగాలకు సిద్ధమయ్యేవారి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ప్రయోగించే ఔషధానికి ఆ వ్యక్తుల శరీరం తట్టుకుంటుందా.. అన్న ప్రాథమిక అంశాలను పట్టించుకోకుండానే ప్రయోగాలు చేస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.

కమిటీ అధ్యయనం ఏమైనట్లు?
నాగరాజు చనిపోయిన తర్వాత ఔషధ ప్రయోగాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఔషధ ప్రయోగాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం జూలై 5న రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. 30 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని పేర్కొంది. కానీ ఇప్పటికీ కమిటీ నివేదిక అందలేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

రక్తపు వాంతులతో యువకుడు
జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన బోగ మార్కండేయ, స్వరాజ్యం దంపతులకు ముగ్గురు కుమారులు రాజేశ్, సురేశ్, సంతోష్‌. మార్కండేయ ఎనిమిదేళ్ల కింద మరణించడంతో స్వరాజ్యం బీడీలు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. రెండో కుమారుడు సురేశ్‌ హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పని చేస్తున్నాడు. అతడికి కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన కిషన్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. ఔషధ ప్రయోగాలకు అంగీకరిస్తే డబ్బులు వస్తాయని కిషన్‌ చెప్పడంతో.. సురేశ్‌ అందుకు సిద్ధమయ్యాడు. 2015 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు పట్టణాల్లో సుమారు 15 సార్లు ఔషధ ప్రయోగాల్లో పాల్గొన్నాడు. తాజాగా ఈ ఏడాది జూలైలో బెంగళూరులోని అపోటెక్స్‌ కంపెనీలో మత్తుకు సంబంధించిన ప్రయోగంలో పాల్గొన్నాడు. సదరు కంపెనీ రూ.8,795 వేలను చెక్కు రూపంలో అందజేసింది కూడా. అయితే రెండు నెలలుగా సురేశ్‌ ఆరోగ్యం క్షీణించింది. ఒంటి నొప్పులు, నిద్రలేమితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... కొత్తపల్లి హనుమాన్‌ ఆలయం వద్ద తలతిరిగినట్లు అయి కిందపడిపోయాడు. రక్తం వాంతులు చేసుకున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వారు వెంటనే 108 ద్వారా జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. సురేశ్‌ రక్తపు వాంతులు చేసుకున్న విషయం తెలుసుకున్న తల్లి స్వరాజ్యం కుమారుడి వద్దకు చేరి బోరున విలపించింది.

కొత్తపల్లిలోనే ఎందుకు?
ఔషధ ప్రయోగాలకు పలు కంపెనీలు జమ్మికుంట మండలంలోని కొత్తపల్లిని టార్గెట్‌ చేసుకున్నాయి. జమ్మికుంట పట్టణానికి ఆనుకుని ఉన్న కొత్తపల్లి పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇతర చోట్ల నుంచి జమ్మికుంట పట్టణానికి వలస వచ్చే పేదలు కొత్తపల్లిలోనే నివసిస్తుంటారు. దీంతో ఎవరు కొత్తవారో, ఎవరు పాతవారో తెలియని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న పలు ఔషధ కంపెనీల ఏజెంట్లు.. కొత్తపల్లికి చెందిన పేదలకు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలోనే అశోక్‌కుమార్, సురేశ్‌తో పాటు మరికొందరు ఔషధ ప్రయోగాల బారిన పడ్డారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement