
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మాస్పత్రులు దగా పడుతున్నాయి. రోగుల అవసరాలతో సంబంధం లేని, గడువు సమీపించిన నాసిరకం మందులు కొనుగోలు చేయడం, తీరా అవి ఎక్స్‌ఫైరీ అయినట్లు పేర్కొని గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం ఇటీవల పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఖరీదైన మందుల సంగతేమో గానీ, బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు మందుల చీటీ పట్టుకుని ప్రైవేటు ఫార్మసీలను ఆశ్రƬంచాల్సిన దుస్థితి తలెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల మందులకు భారీగా బడ్జెట్‌కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులతో కొనుగోలు చేసినా.. రోగుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేక పోతున్నారు. ఫలితంగా ఇన్‌పేషెంట్లతో పాటు అవుట్ పేషెంట్లకు మందుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కొరతపై ఉస్మానియా ఆస్పత్రి అధికారులు ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు లేఖ రాయడం గమనార్హం.
మందుల సరఫరా బంద్
ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 2 వేల మంది రోగులు వస్తుండగా, ఇన్‌పేషెంట్ వార్డుల్లో వేయి మందికి పైగా చికిత్స పొందుతుంటారు. చిన్న, పెద్దా కలిపి ఇక్కడ రోజుకు 150–200 చికిత్సలు జరుగుతుంటాయి. సర్జకల్ డిస్పోజల్స్, సర్జికల్ బ్లేడ్స్, గ్లౌజులు సహా ఎక్సరే, సీటీ, ఎంఆర్‌ఐ ఫిలిమ్స్ సహా హెచ్‌ఐవీ రాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. అంతేకాదు డిసైక్లోఫెనిక్ సోడియం 50 ఎంజీ, ఎల్‌పీఎం 4 ఎంజీ, అజింత్రో, స్టెరిలేన్ వాటర్ ఫర్ ఇంజక్షన్ 10 ఎంఎల్, టెటనస్ టాక్సెడ్, ల్యాక్టోసెల్ సొల్యూషన్, యాసిడ్ కార్బల్ 100 ఎంజీ, లైసోల్ 500ఎంజీ, పారసిటమాల్ 100 ఎంజీ, సోడియం హైడ్రోక్లోరైడ్, కెటమిన్ 50ఎంజీ, డోపమిన్ 200 ఎంజీ, హెపటైటీస్–బి, హిమోగ్లోబిన్ సహా మొత్తం 120 రకాల మందులకు ఇరువై రోజుల క్రితమే టీఎస్‌ఎంఐడీసీకి ఇండెంట్ పంపారు. కానీ ఇప్పటి దాకా ఆయా మందులు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది మధుమేహులు వస్తుంటారు. టీఎస్‌ఎంఐడీసీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో వారంతా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.150 వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని కొనుగోలు చేసే శక్తి లేక మధుమేహులు తరచూ ఆందోళనకు దిగుతుండటం గమనార్హం. ఇలా ఒక్క ఉస్మానియాలోనే కాదు గాంధీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
అవసరాలకు భిన్నంగా కొనుగోళ్లు
తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఆస్పత్రులు, రోగుల అవసరాలతో సంబంధం లేకుండా ఇతర మందులు కొనుగోలు చేస్తుండడం, వినియోగం లేక ఏళ్ల తరబడి స్టోర్స్‌లోనే మగ్గిపోతుండడం, తీరా గడువు ముగియడంతో గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. సర్జరీలు చేసే ఆస్పత్రులకు సరఫరా చేసే ‘ట్రమడాల్’ వంటి పెయిన్ కిల్లర్ మందులను అవసరం లేకపోయినా ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయడం తెలిసిందే. ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ తర్వాత పారసిటమాల్‌కు బదులు పిల్లలకు ట్రమడాల్ ఇవ్వడం, ఇద్దరు పిల్లలు చనిపోవడం, ఆ సంస్థపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పరిశీలిస్తే మందుల సరఫరా ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు టీఎస్‌ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం మందుల కోసం కేటాయించిన బడ్జెట్‌లో 80 శాతం నిధులు టీఎస్‌ఎంఐడీసికి, 20 శాతం నిధులు ఆస్పత్రికి కేటాయిస్తుంది. ఇలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ఏటా రూ.30 కోట్లకు పైగా కేటాయిస్తుంది. టీఎస్‌ఎంఐడీసీ సరఫరా చేయని మందులను ఆస్పత్రి వైద్యులే 20 శాతం వాటా నుంచి కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీజన్‌లో రోజు వారి సగటు ఓపీ మూడు వేలకుపైగా నమోదైంది. అంచనాలకు మించి రోగులు రావడంతో మందుల కొరత తీవ్రమైంది. ఆరోగ్యశ్రీ, నిధులతో కొన్ని రకాల మందులు కొనుగోలు చేస్తున్నప్పటికీ రోగుల పూర్తిస్థాయి అవసరాలు తీర్చలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్ మేనేజ్‌మెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందులను సాధారణ రోగులకు సర్ధుబాటు చేయాల్సి వస్తోందని ఆయా ఆస్పత్రుల అధికారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment