సంగమేశ్వర్‌లో ధర్నా చేస్తున్న క్రైస్తవులు
దోమకొండ : మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలోగల గుడ్‌ఫ్రూట్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం షెడ్డును కూల్చివేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మండలకేంద్రంలో ఆదివారం కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు ధర్నా చేశారు. మొదట సంగమేశ్వర్ గ్రామంలో వారు ధర్నా చేశారు. అక్కడి నుంచి దోమకొండకు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. తమకు న్యాయం చేయలంటూ నినాదాలు చేశారు.
కావాలనే ప్రార్థన మందిరం షెడ్డును కూల్చివేశారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కూల్చివేతలో గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు పాత్ర ఉందని, వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి అక్కడి నుంచి తిరిగి సంగమేశ్వర్ గ్రామ మూలమలపు వద్దకు చేరారు. రోడ్డుపై బైఠాయించి «ధర్నా చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని కోరినా పొలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
దోమకొండతోపాటు సంగమేశ్వర్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన క్రిస్టియన్ సంఘాల వారు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. సాయంత్రం వరకు కొనసాగిన «ధర్నా పోలీస్ అధికారులు వారిని సముదాయించడంతో విరమించారు. ప్రార్థన మందిరానికి సంబంధించిన షెడ్డు కూల్చివేయడంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని న్యాయం చేస్తామని పోలీసులు వివరించారు.
భారీ పోలీస్ బందోబస్తు..
ధర్నా సందర్బంగా ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. కామారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, భిక్కనూరు సీఐ కోటేశ్వర్‌రావ్, మాచారెడ్డి ఎస్‌ఐ కృష్టమూర్తి, రాజంపేట ఎస్‌ఐ రవిగౌడ్, భిక్కనూరు ఎస్‌ఐ రాజుగౌడ్, దోమకొండ ఎస్‌ఐ నరేందర్‌తో పాటు సిబ్బంది గొడవలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. కాగా కూల్చివేతకు సంబంధించి సంగమేశ్వర్ గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment