
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నిర్మాణంలో ఉపయోగించిన పలు సెగ్మెంట్లు, రెక్కలు, సైడ్‌వాల్స్, వయాడక్ట్‌లను నిర్మాణ ప్రాంతంలో కాకుండా ప్రత్యేక యార్డుల్లో (ప్రీకాస్ట్ యార్డులు) తయారు చేశారు. వీటిని రహదారి మధ్యలో నిర్మించిన ఎత్తైన పిల్లర్లపైన అమర్చారు. మత్తమ్మీద మెట్రో నిర్మాణంలో ప్రీకాస్ట్ సాంకేతికత ఇంజినీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. ప్రధాన రహదారులపై మెట్రో నిర్మాణం చేపట్టిన కారణంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా కుత్భుల్లాపూర్, ఉప్పల్ కాస్టింగ్ యార్డుల్లో సెగ్మెంట్లను రూపొందించారు. ఒక్కో సెగ్మెంట్ బరువు 40 టన్నులమేర ఉంటుంది. పనులు జరిగే ప్రాంతంలో పిల్లర్ల ఎత్తు, రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి వీటి సైజులుంటాయి. వీటి పరిమాణాన్ని హైడ్రాలిక్ జాక్‌లతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా డిజైన్‌చేశారు. మొత్తం 31 రకాల సెగ్మెంట్లను తయారుచేశారు. వేర్వేరు రకాల సెగ్మెంట్లకు పలు రకాల గ్రేడ్‌ల సిమెంట్‌ను వినియోగించారు. కొన్నింట్లో రసాయనాలను మిలితం చేశారు. ఇందుకోసం ప్రత్యేక ప్రయోగశాలను కూడా నిర్మించడం విశేషం.
మెట్రో ప్రీకాస్ట్‌లో తయారుచేసిన విడిభాగాలివే..
పిల్లర్ల మధ్యన ఏర్పాటుచేసిన సెగ్మెంట్లు,స్టేషన్‌కు పక్షిఆకృతిలో ఏర్పాటుచేసిన రెక్కలు,సైడ్‌వాల్స్,ప్లాట్‌ఫాం పై ఉన్న వయాడక్ట్‌లు. వీటి తయారీ అనంతరం 10 మంది నిపుణుల బృందం తనిఖీచేసిన తరవాతనే పిల్లర్లపై వీటిని అమర్చారు.
కాస్టింగ్ యార్డులూ ప్రత్యేకం..
దేశంలోనే అతిపెద్ద కాస్టింగ్‌యార్డును ఉప్పల్‌లో 72 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఇక కుత్బుల్లాపూర్‌లో 64 ఎకరాల హెచ్‌ఎంటీ స్థలాన్ని లీజుకు తీసుకొని ఈ యార్డును ఏర్పాటుచేయడం విశేషం. మొత్తం మెట్రో ప్రాజెక్టులో 28వేల సెగ్మెంట్లను నిర్మించారు..
మెట్రో ట్రాక్..
పిల్లర్లపై ఏర్పాటుచేసిన వయాడక్ట్ సెగ్మెంట్లపై మెట్రో పట్టాలు పరిచారు. ఈ సెగ్మెంట్లు చూడ్డానికి చిన్నవిగానే కనిపించినా..మెట్రో రూట్లో సుమారు 33 అడుగుల విశాలంగా వంతెన ఏర్పాటుచేసి వాటిపై రెండువరుసల పట్టాలు (డబుల్‌ట్రాక్) ఏర్పాటుచేశారు. ఆపత్కాలంలో ఏదేనా రైలు పట్టాలపై నిలిచినా రైలు దిగి సమీప స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లేందుకు మధ్యలో రెండు పట్టాల మద్యన ఖాళీస్థలం కూడా ఉంది. ఇక పంజగుట్ట, బేగంపేట్ పబ్లిక్‌స్కూల్ వద్ద మూడు వరుసల ట్రాక్‌ను నిర్మించారు. ఏదేని రైలు పట్టాలపై అత్యవసరంగా నిలిచిపోతే ఈ ట్రాక్ మీద రైలును నిలుపుతారు. అక్కడి నుంచి అర్థరాత్రి డిపోకు తరలిస్తారు.
పిల్లర్లపై భారం ఇలా..
♦ ఒక్కోరైలులో వెయ్యి మంది ప్రయాణికులు ప్రయాణిస్తే పిల్లర్‌పై పడే భారం 200 టన్నులు
♦ ఒకదాని వెనక మరో రైలు వెళితే 400 టన్నులు
ప్రీకాస్ట్‌తో మేడ్ మెట్రో ఇలా..
♦ ప్రీకాస్ట్ విధానంలో 85 శాతం మెట్రో పనులు పూర్తిచేశారు.
♦ రహదారులపై ఇసుక, కంకర, సిమెంటు,స్టీలు వంటి నిర్మాణ వ్యర్థాల కాలుష్యం లేకుండా చూడగలిగారు.
♦ ఈ నిర్మాణాలు నాణ్యత, మన్నిక పరంగానూ అత్యున్నతమైనవి.
మియాపూర్‌లో హెలికాప్టర్ ట్రయల్ రన్
మియాపూర్: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రత్యేక హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఈమేరకు ఆదివారం ఇక్కడ హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు హెలికాప్టర్లు ల్యాండ్ చేయడం కోసం డిపో ప్రాంగణంలోనే విశాలమైన ప్రదేశంలో మూడు హెలిప్యాడ్‌లు నిర్మించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఒక హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.
నత్తనడకన పనులు
మియాపూర్: మెట్రో ప్రారంభోత్సవానికి అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదు. మెట్రో స్టేషన్‌లో గ్రీనరీ, పుట్‌పాత్, పార్కింగ్ ఏరియా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి ఒక రోజే సమయం ఉంది. స్టేషన్ల వద్ద పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మెట్రో రైల్‌లో ప్రయాణించాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఈ నెల 29న తొలిరోజు నుంచి వారం పది రోజులపాటు స్టేషన్ వద్ద భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉంది. రద్దీకి తగినట్లు ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది.
అధికారుల తనిఖీలు
మియాపూర్: మియాపూర్ మెట్రో స్టేషన్, హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో, డిపో వద్ద పోలీస్ అధికారులు భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఐఎస్‌డబ్ల్యూ, ఎస్‌పీజీ అధికారులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహించారు. ఐఎస్‌డబ్ల్యూ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, ఇతర ఆధునిక స్కానర్లతో తనిఖీ చేశారు.
మెట్రో స్టేషన్ సందర్శించిన ఉన్నతాధికారులు
మియాపూర్‌లో అధికారులు ఎప్పటికప్పుడు పనులు, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాచకొండ అడిషనల్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, మెట్రో అధికారులతో కలిసి హెలిప్యాడ్, మెట్రో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న పైలాన్, మెట్రో స్టేషన్‌ను పరిశీలించారు.
28న ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రారంభించనున్న మంగళవారం (ఈ నెల 28న) సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం మూడు నుంచి 4.30 గంటల ప్రాంతంలో ఇవి అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మియాపూర్ నుంచి కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలను చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వయా గచ్చిబౌలి మీదుగా అనుమతించనున్నారు. మియాపూర్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మియాపూర్ వద్ద దారి మళ్లించి చందానగర్, పటాన్‌చెరు, ఓఆర్‌ఆర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు అనుమతించనున్నారు. మాతృశ్రీ నగర్ నుంచి వచ్చే వాహనాలను షీలా పార్క్ ప్రైడ్ వద్ద దారి మళ్లించి మంజీరా రోడ్డువైపు అనుమతించనున్నారు. పటాన్‌చెరు, ఇక్రిశాట్, బీరంగూడ, ఆర్‌సీపురం, అశోక్‌నగర్, బీహెచ్‌ఈఎల్ నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ వెళ్లే వాహనాలను బీహెచ్‌ఈఎల్ రోటరీ వద్ద మళ్లించి నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మొహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మెహదీపట్నం మీదుగా హైదరాబాద్‌కు అనుమతివ్వనున్నారు. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఓఆర్‌ఆర్ ముత్తంగి వద్ద దారి మళ్లించనున్నారు.
సాయంత్రం 6–8 గంటల సమయంలో...
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభానికి హాజరై అతిథులంతా రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లనుండటంతో ఆ సమయంలో హెచ్‌ఐసీసీ నుంచి కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్ మార్గంలో వెళ్లే వాహనదారులు 6–8 గంటల ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సందీప్ శాండిల్య సూచించారు. యథావిధిగానే గచ్చిబౌలి ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులో ఉంటుంది. వీవీఐపీ రాకను బట్టి అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ నిలిపివేస్తామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు మంగళవారం ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.