పాత అలైన్‌మెంట్ ప్రకారమే మెట్రో పనులు: వీబీ గాడ్గిల్
ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫలక్‌నుమా మెట్రో డిపో పనులు
ఉప్పల్ స్టేషన్‌లో రిటెయిల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ‘మెట్రో’ ఎండీ
సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది ఉగాది నాటికి(ఏప్రిల్ మాసం)లో హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభించే అవకాశాలున్నాయని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రారంభించే తేదీని మాత్రం ప్రభుత్వమే ప్రకటిస్తుందన్నారు. ప్రస్తుతం మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లో మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో ముందుగా నిర్ణయించిన మార్గం(ఒరిజినల్ అలైన్‌మెంట్) ప్రకారమే పనులు చేపడతామని.. అసెంబ్లీ ముందు నుంచి, సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కెట్ మధ్య నుంచి మెట్రో పనులు జరగనున్నాయని స్పష్టం చేశారు. పాత నగరంలోనూ గతంలో నిర్ణయించినమార్గంలోనే పనులు చేపట్టే అవకాశాలున్నాయని, అయితే ఈ విషయంలో ఆస్తుల సేకరణకు బాధితులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే పాతనగరంలో ఫలక్‌నుమా మెట్రో డిపోతోపాటు మెట్రో మార్గం పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మెట్రో అలైన్‌మెంట్ సహా ఇతరత్రా ప్రభుత్వంతో ఎలాంటి పేచీ లేదన్నారు. గురువారం ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రిటెయిల్ అవుట్‌లెట్, వాణిజ్య ప్రకటనల బోర్డులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాగోలు-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో బోయిగూడా, ఆలుగడ్డబావి, ఒలిఫెంటాబ్రిడ్జి ప్రాంతాల్లో రైలు ఓవర్‌బ్రిడ్జి(ఆర్‌ఓబీ)లను వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తిచేస్తేనే ఈ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయన్నారు.
ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతులు దక్కితే మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలుంటాయని చెప్పారు. అమీర్‌పేట్, గ్రీన్‌ల్యాండ్స్, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ, విద్యుద్దీపాలు, మంచినీటి పైప్‌లైన్ల మార్పు పనులు కొలిక్కి వ స్తున్నాయన్నారు. మెట్రో స్టేషన్లలో రిటెయిల్ స్థలం, వాణిజ్య ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు, వ్యక్తులు హైటెక్‌సిటీ సైబర్‌టవర్స్‌లోని ఎల్‌అండ్‌టీ మెట్రో కార్యాలయాన్ని గాని లేదా ఎల్‌అండ్‌టీ మెట్రో వెబ్‌సైట్లోగాని సంప్రదించాలని తెలిపారు.
వచ్చే ఉగాదికి మెట్రో పరుగులు
Published Fri, Nov 27 2015 4:04 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement