
ఏడాది చివరికల్లా మెట్రో పరుగులు!
సబర్మతి ఫ్రంట్ మాదిరిగా మూసీ సుందరీకరణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ఈ ఏడాది చివరిలోగా పరుగులు పెడుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 27 కిలోమీటర్ల మెట్రో మార్గం డిసెంబర్ ఆఖరుకల్లా అందుబాటులోకి రానుందని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ)’తో పాటు నాలుగు ప్రాంతాల్లో స్కైవేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. హైదరాబాద్ జలమండలికి కూడా అదే స్థాయిలో రూ.1,420 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను నియంత్రించడానికి, సంబంధిత కేసులను వేగంగా పరిష్కరించడానికి బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను త్వరలోనే ఏర్పాటు చేయ బోతున్నామని మంత్రి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని పట్టణాల్లోనూ పైసా లంచం ఇవ్వకుండా ప్రజలు గృహ నిర్మాణ అనుమతులు పొందేలా చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు.