
మార్గ నిర్దేశకులు యువతే
సాక్షి, హైదరాబాద్: మహానగరాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఉద్దేశించిన మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును మంగళవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, రోడ్లపై మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలు, శానిటేషన్-వేస్ట్ మేనేజ్‌మెంట్, మురికివాడల్లో ఆరోగ్య సేవలు, ఇళ్లకు నంబర్లు వంటి అంశాలపై విడివిడిగా చర్చ ప్రారంభమైంది. భవిష్యత్తులో యువత ఆలోచనలే నగరాల రూపురేఖలను మారుస్తాయని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. యువత సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.
సోమవారం దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన 782 మంది ప్రతినిధులతోపాటు విదేశాలకు చెందిన 140 మంది ప్రతినిధులు హజరయ్యారు. 10వ తేదీ వరకు సాగనున్న ఈ సదస్సులో మంగళవారం 400 మందికి పైగా విదేశీ ప్రతినిధులతో సహా 2 వేలమందికి పైగా హాజరు కాగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం కార్యక్రమంలో గవర్నర్, సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మేయర్ మాజిద్, మెట్రోపొలిస్ అధ్యక్షుడు జీన్‌పాల్ పాల్గొననున్నారు.
గళమెత్తిన బాలలు..
తొలిరోజు ‘వాయిస్ ఆఫ్ చిల్డ్రన్’ అంశంపై ప్రసంగించిన బాలలు నగరాల్లోని మురికివాడల దుర్భర పరిస్థితులపై ధారాళంగా ప్రసంగించారు. తమకు ఇళ్లు, తాగునీరు, మరుగుదొడ్లువంటి సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. పారిశుధ్య నిర్వహణ, ఆటస్థలాలు లేకపోవడం, రోడ్లపై ప్రాణాంతకంగా వేలాడే విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాల్లో రక్షణ చర్యలు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. మురికివాడల్లోకి అంబులెన్స్‌లు త్వరితంగా వెళ్లేందుకు వీల్లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు రూపొందించేటప్పుడు బాలల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. బాలల అభిప్రాయాలతో ఆయా ప్రభుత్వాలు తగిన పాలసీలు రూపొం దించే అవకాశముందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ సెషన్‌లో పాల్గొన్న బాలల్లో హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్, ముంబైకి చెందిన కాజల్ ఖురానా, ఢిల్లీకి చెందిన మాలతీయాదవ్ ఉన్నారు.
ఇళ్ల ధరలు అందుబాటులో ఉండాలి..
దేశంలో అందరికీ ఇళ్లు సమకూరాలంటే అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు తమ సలహాలిచ్చారు. ముఖ్యంగా ఇళ్ల ధరలు ప్రజలు భరించగలిగే ధరల్లో ఉండాలని. అందుకు ప్రైవేట్ రంగం కూడా తమ వంతు సహకారం ఇవ్వాలని సూచించారు. హౌసింగ్ పాలసీలు-అమలుకు మధ్య వ్యత్యాసం ఉంటోందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించనున్న ఇళ్ల ప్రస్తావన కూడా వచ్చింది. తొలిరోజు పలు అంశాలపై జరిగిన చర్చల వివరాలను ఆయారంగాలకు చెందిన విదేశీ ప్రముఖులు మీడియాకు వివరాలు తెలియజేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సీనియర్ డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వారిని మీడియాకు పరిచయం చేశారు.
హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు
హైదరాబాద్ హాకథాన్ పేరిట ఒక పోటీని నిర్వహిస్తున్నాం. నగరంలోని సమస్యల పరిష్కారానికి 20 బృందాలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించాం. ఈ పోటీలో చివరకు 5 బృందాలను ఎంపికచేస్తాం. నగరాలనేవి ఫైబర్ ఆప్టిక్ట్‌లకే పరిమితం కావొద్దు. ప్రజలు, ప్రభుత్వం, పౌరసమాజం కలిసి ప్రణాళికలు రూపొందించుకోవాలి. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉంది.
- ఆల్ఫెన్స్ గోవెల (నెక్స్ ్టస్మార్డ్ సిటీస్ వ్యవస్థాపకులు, మెక్సికో)
యువత నడిపిస్తుంది
భవిష్యత్ నగరాలు కాంట్రీబ్యూటరీ నగరాలుగా ఉండాలి. యువజనులు తప్పకుండా మార్పు తీసుకురాగలరు. యువత ఆలోచనా ధోరణులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. నగరాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలకు యువత పరిష్కారాలను కనుక్కుంటుంది.
- అలెన్ ర్యాంక్ (సిటీ ప్లానర్, ఫ్రాన్స్)
వారి ఆలోచనలను పట్టుకుంటే అద్భుతాలే
నేటి యువత అద్భుతమైన ఆలోచనలను ఆవిష్కరిస్తోంది. ఈ ఆలోచనలను ఒడిసిపట్టగలిగితే ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. హైదరాబాద్‌లో మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. డిజిటల్ ప్రాజెక్ట్స్ ముఖ్య భూమిక నిర్వహిస్తాయి.
- ఫిలిప్ వీస్ట్ (డిజిటల్ ప్రాజెక్ట్స్, బ్రిటన్)
మంచి ప్రతిపాదనలు వచ్చాయి
హైదరాబాద్ అర్బన్ హాకథాన్ పేరిట నగరంలోని సమస్యలకు 18-35 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న యువత ద్వారా పరిష్కారాలను ఆహ్వానించాం. మైక్రోసాఫ్ట్, ఐఐఐటీ-హైదరాబాద్ 20 బృందాలను ఎంపిక చేసింది. వీటి నుంచి 5 బృందాలను ఎన్నుకుని ఆయా సమస్యలపై ప్రాజెక్టులను చేపట్టాలి. పలు అంశాలపై మంచి ప్రతిపాదలు వచ్చాయి.
- సుబ్రహ్మణ్య శర్మ (ఐఎస్‌బీ సీనియర్ డెరైక్టర్)
మెట్రోపొలిస్‌లో నేడు చర్చించనున్న ముఖ్యాంశాలు
గ్లోబల్ వాటర్ లీడర్‌షిప్
న్యూ సిటీస్/ విజనరీ ఆర్ కానండ్రమ్
సస్టెయినబుల్ హైదరాబాద్ రిపోర్ట్
సిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్- వేస్ట్ మేనేజ్‌మెంట్
ఫైనాన్సింగ్ అర్బన్ ఇండియా
బిజినెస్ ఆఫ్ సిటీస్ ఎకానమీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్
సర్కిల్స్ ఆఫ్ సస్టెయినబిలిటీ
ఈ-అర్బన్ గవర్నెన్స్
స్మార్ట్‌సిటీస్ అజెండా- థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్
సాయంత్రం 5 గంటలకు హైటెక్‌సిటీ వద్ద స్మార్ట్‌సిటీ అంశంపై