మోర్తాడ్/సాక్షి, జగిత్యాల: బతుకుదెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఒక పక్క ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడగా, మరో పక్క సాధారణ ప్రయాణికుల షెడ్యూల్ విమానాలకు ప్రభుత్వాల అనుమతి లేకపోవడంతో ఇంటికి రావాలనుకుంటున్న కార్మికులకు చార్టర్డ్ విమానాలే దిక్కవుతున్నాయి. దీంతో రవాణా చార్జీ తడిసి మోపెడవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతర్‌లలో లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లాలనుకునే తెలంగాణ కార్మికులు చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు రావాలంటే విమానాల్లో టికెట్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో షెడ్యూల్ విమానాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.
చార్టర్డ్ విమానాల ల్యాండింగ్‌కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పలు గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఒక్కో వ్యక్తినుంచి టికెట్ ధర రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో చార్జీలు అధికంగా ఉండడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న అనేక మంది కార్మికులు తమకు తెలిసిన వారి వద్ద అప్పు చేస్తున్నారు. కొందరు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో కూడా వెంటనే టికెట్లు లభ్యం కావడం లేదని, రోజుల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక భారంతో ఉన్న తమను ఆదుకోవడానికి సాధారణ విమానాలకు అనుమతివ్వాలని కార్మికులు కోరుతున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుపుతున్న విమానాలు అరకొరగా ఉండటంతో చార్టర్డ్ విమానాలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు.
గల్ఫ్ కార్మికులకు ఎంతో నష్టం కలిగింది
కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల గల్ఫ్ కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. నష్టానికి తోడు ఇంటికి రావాలంటే రవాణా చార్జీల భారమూ పెరిగింది. ఉపాధి లేక ఆందోళనలో ఉన్న కార్మికులకు రవాణా చార్జీలు అధికం కావడం ఇబ్బందిగా మారింది. – సిద్దిరాములు, పెద్దమల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా
షెడ్యూల్ విమానాలను నడపాలి..
గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎంతో మంది తెలంగాణ వాసులు ఇళ్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చార్టర్డ్ విమానాల టికెట్ ధర భారీగా ఉంది. వాటిలో రావడం తలకుమించిన భారం. షెడ్యూల్ ప్రకారం విమానాలను నడిపి వలస కార్మికులను ఇళ్లకు రప్పించాలి. – నవీన్, చంద్రాయన్‌పల్లి, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment