బాధితులను హైదరాబాద్‌కు తరలిస్తున్న వైద్యులు
జనగామ / రఘునాథపల్లి: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో వలస కార్మికుల రూపంలో మళ్లీ కలకలం రేపింది. గతంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ రాగా, అదే రైలులో ప్రయాణించిన ఓ జవాన్‌కు సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, ఒకరికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరెంజ్ జోన్‌లో ఉన్న జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 100 శాతం, మునిసిపల్ పరిధిలో 50 శాతం వ్యాపారాలకు ప్రభుత్వం సడలింపునిచ్చిన సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన భార్యాభర్తల(వలస కార్మికులు)కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది.
ప్రత్యేక బస్సులో 25 మంది...
జిల్లాలోని రఘునాథపల్లి, లింగాలఘనపురం, బచ్చన్నపేట మండలానికి చెందిన 25 మంది బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి బాంధ్రా గ్రామం కేర్వాడి మండల (పోలీస్‌స్టేషన్) పరిధిలో నివాసముంటూ రోజువారి పనులు చేసుకుంటున్న వారు లాక్‌డౌన్‌తో యాభై రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. అక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సు మాట్లాడుకుని ఈనెల 10వ బయలు దేరి 11వ తేదీ రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఇందులో రఘునాథపల్లి మండలం నిడిగొండకు చెందిన దంపతులు, బచ్చన్నపేట మండలం కొన్నెకు చెందిన ఐదుగురితో పాటు లింగాలఘనపురం మండలానికి చెందిన 18 మంది ఉన్నారు. కొన్నెకు చెందిన ఐదుగురు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో దిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్లారు. ఇక నిడిగొండకు చెందిన భార్యాభర్తలు జనగామ నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లారు. అదేరోజు రాత్రి 11 గంటలకు వారికి దగ్గు, గొంతులో మంట రావడంతో స్థానిక వైద్య సిబ్బంది ఉన్నతా«ధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అశోక్‌కుమార్, డీఎస్‌ఓ పూర్ణచందర్, మండల వైద్యాధికారిని స్రవంతి సిబ్బందితో చేరుకుని దంపతులను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలినట్లు గురువారం నివేదిక వచ్చిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మహేందర్ తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు
మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తమై ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న 23 మంది వలస కార్మికులు ఉన్న గ్రామాలకు వెళ్లారు. 28 రోజుల పాటు బయటకు రావొద్దని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. దగ్గు, దమ్ము, జ్వరం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. కాగా, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ కూడా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment