టోలిచౌకి ప్రాంతంలో స్వస్థలాలకు తరలిపోతామంటూ ఆందోళన చేస్తున్న వలస కార్మికులు..
గోల్కొండ/గచ్చిబౌలి/శంషాబాద్: వలస కార్మికులు రోడ్డెక్కారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని టోలిచౌకీ, గచ్చిబౌలి, శంషాబాద్‌లో ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ కారణంగా చేసేందుకు పని లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా, జార్ఖండ్, కర్ణాటకలతో పాటు బిహార్ రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వలస కూలీలకు అందిస్తున్న సాయం తమకు అందడం లేదని, ఉండటానికి స్థలం లేక పడరాని పాట్లు పడుతున్నామని బిహార్‌కు చెందిన అభయ్ అనే భవన నిర్మాణ కార్మికుడు వెల్లడించాడు. రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడటంతో నో వర్క్, నో పే అంటూ వాటి యజమానులు తమను గెంటేశారన్నారు.
పోలీసులు పుట్‌పాత్‌లపై పడుకోనివ్వడం లేదని, టోలిచౌకీ పరిసరాల్లో ఒక్క నైట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్‌అండ్‌టీ లేబర్ కాలనీలో కార్మికులు సైతం ధర్నాకు దిగారు. తమకు జీతాలిచ్చి, బస్సులు ఏర్పాటు చేస్తే సొంతూళ్లకు వెళ్లిపోతామంటూ ఆందోళన చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయంలోని విస్తరణ పనులు చేస్తున్న వలస కార్మికులు కూడా తమను సొంతూళ్లకు పంపించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయాచోట్లకు వెళ్లి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తామని.. త్వరలోనే ప్రత్యేక వాహనాల ద్వారా స్వస్థలాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
ఇక్కడ ఉండలేం..
రోడ్డెక్కిన గ్రానైట్ కార్మికులు.. సర్దిచెప్పిన అధికారులు
‘లాక్‌డౌన్‌తో పనుల్లేక 40 రోజులుగా అవస్థలు పడుతున్నాం. ఇక ఇక్కడ ఉండలేం. మా రాష్ట్రాలకు తిరిగి వెళ్తాం. వెంటనే అనుమతి ఇవ్వండి’ అంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో వందలాది మంది కార్మికులు ఆదివారం రోడ్డెక్కా రు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మ ధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వందల సంఖ్యలో గ్రానైట్, వాటికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పనులు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు అందించే ఆహారం, వితరణతో నెట్టుకొస్తున్నారు. ఇక పరిశ్రమలు తెరుస్తారో.. లేదోనని కార్మికులు ఆందోళన చెందారు.
తమ ప్రాంతాలకు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్న కార్మికులు ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ నాగండ్ల కోటి, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రాజేష్, వీఆర్వో బాలయ్య, అర్బన్ సీఐ వెంకన్నబాబు, మైనింగ్ ఏజీ గంగాధర్ కార్మికులకు నచ్చజెప్పారు. గ్రానైట్ పరిశ్రమలను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సోమవారం నుంచి పనులు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని సర్ది చెప్పారు. అప్పటి వరకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో శాంతించారు.
ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రానైట్ కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment