బీటీపీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్న కూలీలు
మణుగూరురూరల్:ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సుమారు 200 మంది కూలీలు బుధవారం బీటీపీఎస్ ప్రధాన గేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మూడు నెలలుగా తమకు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని, ఈలోగా లాక్‌డౌన్‌తో పనులు నిలిపివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడ పనిచేసి డబ్బు పంపిస్తేనే అక్కడ తమ కుటుంబాల వారు బతుకుతారని, ఇలాంటి సమయంలో మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏంటని అధికారులను, కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. తాము పనులు చేసే సమయంలో కొంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చేవారని, ఇప్పుడు పనులు లేకపోవడంతో అడ్వాన్స్‌లు అందక, వేతనాలు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పనులు లేకుండా ఖాళీగా ఉంటున్న తమను ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు పంపించాలని ఒడిశా, జార్ఖండ్, పంజాబ్, మహరాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు కోరారు.
ఆందోళన విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ ఎంఏ షుకూర్, తహసీల్దార్ ఎస్.వి.నారాయణమూర్తి అక్కడికి చేరుకుని కార్మికులతో చర్చించారు. వారికి అందాల్సిన వేతనాలు గురించి తెలుసుకున్నారు. పనిచేసే కాంట్రాక్ట్ సంస్థలతో మాట్లాడి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. కాగా, కూలీలకు అందాల్సిన వేతనాల గురించి బీటీపీఎస్ సీఈ పి.బాలరాజును వివరణ కోరగా.. కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని బీహెచ్‌ఈఎల్, దాని అనుబంధ కంపెనీలన్నింటికీ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు వేతనాలు ఇచ్చాయన్నారు. వేతనాలు ఇవ్వని కంపెనీలను గుర్తించి, తక్షణమే కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అవసరమైతే కాంట్రాక్ట్ సంస్థల బిల్లులను కట్ చేసి కార్మికులకు అందిస్తామన్నారు.
వలస కూలీల అడ్డగింత..
జూలూరుపాడు: బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు వెళ్తామంటూ బుధవారం వినోభానగర్‌లో ఆందోళనకు దిగారు. మిరపకాయలు కోసేందుకు మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 8400 మంది కూలీలు మూడు నెలల క్రితం జూలూరుపాడు మండలానికి వచ్చారు. ప్రస్తుతం మిర్చి తోటలు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఉండడంతో వారు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేవు. ఇక్కడ పనులు లేవని, తినడానికి తిండి కూడా దొరకడం లేదని, తమ స్వగ్రామాలకు వెళ్తామంటూ మహరాష్ట్రకు చెందిన 100 మంది కూలీలు కాలినడకన బయలుదేరారు. ఏన్కూరు మండలం టీఎల్ పేట మీదుగా డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కూలీలను స్థానిక అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఏన్కూరు తహసీల్దార్ రమాదేవి జూలూరుపాడు తహసీల్దార్ కె.విజయ్‌కుమార్‌కు తెలియజేశారు. దీంతో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఏన్కూరు మండలం అధికారులు, పోలీసులతో కలిసి వెళ్లి కూలీలకు నచ్చజెప్పి 4 ట్రాక్టర్లలో వినోభానగర్‌కు తీసుకొచ్చారు.
ఆ గ్రామం దాటిన తర్వాత కొందరు కూలీలు ట్రాక్టర్లు దిగి తిరిగి వెళ్లిపోతామని భీష్మించారు. రెండు రోజులుగా అన్నం, నీళ్లు లేవని, తమను సొంత ఊళ్లకు పంపించాలని అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కూలీలను జీపులో ఎక్కించాలని సీఐ నాగరాజు సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులకు కూలీలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బిక్కాజీ అనే కూలీ సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది చూసిన మిగితా వారు ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చారు. బిక్కాజీని పోలీసులు కొట్టడం వల్లే పడిపోయాడని, రెండు రోజులుగా ఆకలితో బాధపడుతున్న బిక్కాజీ.. పోలీసు దెబ్బలతోనే అస్వస్థతకు గురయ్యాడని ఆరోపించారు. కూలీలు, మహిళలు పోలీసులపైకి రాళ్లు, కట్టెలు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత కూలీలు రోడ్డుపై బైఠాయించి తమ సమస్య పరిష్కరిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని భీష్మించారు. అయితే లాక్‌డౌన్ అమలులో ఉన్నందున వెళ్లడానికి వీల్లేదని, పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని, భోజ నం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తహసీల్దార్ విజయకుమార్, ఎస్సై పి.శ్రీకాంత్ సర్దిచెప్పారు. అయితే పోలీసులు ఎందుకు కొట్టారో చెప్పాలని కూలీలు పట్టుబట్టారు. దీంతో తహసీల్దార్ కలుగజేసుకుని అధికారుల, పోలీసులు ఏమైనా తప్పు చేసే క్షమించాలన్నారు. అస్వస్థతకు గురైన బిక్కాజీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అందరినీ నర్సాపురంలోని శిబిరానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment