దండేపల్లి: ఉపాధి కోసం ఊరు వదిలి ఇరాక్ వెళ్లిన వలస కూలీలకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. తిరిగి భారత్‌కు వద్దామనుకుంటే చాలామందికి వీసా గడువు ముగియడంతో ఇరాక్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో వలస కార్మికులకు ఏం చేయాలో తెలియక బోరుమంటున్నారు. కార్మికులు తమ బాధలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మంత్రి కేటీఆర్‌తో పాటు, ఎంపీలకూ ట్విట్టర్‌లో పోస్టులు సైతం చేశారు. వివరాలు.. కోవిడ్–19 కారణంగా ఇరాక్‌లో కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కొందరు భారతీయులకు వీసా గడువు ముగిసింది. ఇంకొందరికి అకామా(గుర్తింపు కార్డు)లేక కంపెనీల్లో పనులు దొరకడం లేదు. దీంతో వలస కార్మికులు రోడ్డున పడ్డారు. నాలుగు నెలలుగా ఉండేందుకు, తినేందుకు ఇబ్బంది పడుతున్నారు.
ఇవన్నీ భరించలేక ఇంటికి వద్దామన్నా వచ్చే పరిస్థితులు లేవు. ఇక వీసా గడువు ముగిసిన వారు ఇరాక్‌లోనే ఉంటే వారికి నెలకు రూ. 30వేలు వరకు అక్కడి ప్రభుత్వం జరిమానాలు కూడా విధిస్తుండటం వలస కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇరాక్‌లో తెలంగాణకు చెందిన సుమారు 250 మందికిపైగా ఇబ్బందులు పడుతున్నామని తమ బాధలను సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు. ఇరాక్‌లో ప్రస్తుతం ఉండటానికి, తినడానికి ఇంటి దగ్గర అప్పులు చేయించి డబ్బులు తెప్పించుకుంటున్నామని, తమని స్వరాష్ట్రానికి రప్పించేలా చేయాలని మాజీ ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌లకు ట్విట్టర్‌లో వేడుకుంటూ సందేశం పంపారు. కాగా, గత నెల 13న తమ కోసం ఎర్బిల్‌లో విమానం సిద్ధం చేసినా ఇరాక్ ప్రభుత్వం అకామాలు లేవని ఇండియాకు పంపకుండా అడ్డుకుందని వారు వాపోయారు. ఎర్బిల్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment